పతనం అంచున బీజేపీ సర్కార్‌ | NPP withdraws support To BJP In Manipur 3 BJP MLAs resign | Sakshi
Sakshi News home page

పతనం అంచున బీజేపీ సర్కార్‌

Published Thu, Jun 18 2020 8:23 AM | Last Updated on Thu, Jun 18 2020 11:34 AM

NPP withdraws support To BJP In Manipur 3 BJP MLAs resign - Sakshi

రాజీనామా ప్రకటిస్తున్న మంత్రులు

 ఇంపాల్‌ : ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను విచ్చిన్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) ఊహించని షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తమ పార్టీకి చెందిన నలుగురు మంత్రుల చేత గురువారం రాజీనామా చేయించింది. వీరిలో డిప్యూటీ సీఎం జోయ్‌ కుమార్‌ సింగ్‌ కూడా ఉన్నారు. మరోవైపు బీజేపీ సర్కార్‌కు మద్దతు ఇస్తున్న మరో నలుగురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు కూడా దోస్తీకి గుడ్‌బై చెప్పారు. అంతేకాకుండా అధికార పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు సైతం తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వానికి గట్టి షాక్‌ ఇచ్చారు. (విభేదాలు వీడి కలిసి పనిచేద్దాం)

దీంతో బీరేన్‌ ప్రభుత్వం శాసనసభలో మైనార్టీలో పడింది. ఇక ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేంతా ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం ఊహించని పరిణామం. ఈ క్రమంలోనే అసెంబ్లీలో బలనిరూపణ చేపట్టాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పక్షనేత ఇబోబీ సింగ్‌ గవర్నర్‌తో భేటీ కానున్నారు. బీజేపీ ప్రభుత్వం సభలో విశ్వాసాన్ని కోల్పోయిందని, వెంటనే బర్తరఫ్‌ చేయాలని కోరనున్నారు. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికల ముందు బీజేపీకి ఈ పరిణామం ఊహించనింది.

కాగా 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు కాగా 28 సీట్లలో కాంగ్రెస్‌ విజయం సాధించి.. సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయతే కేవలం 21 స్థానాలు గెలిచిన బీజేపీ ఇతరులను తమవైపుకు తిప్పుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా రాజీనామాలతో బీజేపీ సభ్యుల సంఖ్య 19కి పడిపోయింది. ఇతరుల మద్దతు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామలపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తోంది. (మళ్లీ తెర ముందుకు అమిత్‌ షా!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement