సాక్షి, న్యూఢిల్లీ: రెండునెలల నుంచి హడావిడి నెలకొన్న అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఉత్తర ప్రదేశ్ చివరి విడత ఎన్నికలు సోమవారంతో పూర్తవడంతో ఎగ్జిట్ పోల్స్ విడులయ్యాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి.. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ తమ బలాన్ని మరోసారి నిలబెట్టుకోనుందా?..లేదా కొత్త పార్టీకి పట్టం కట్టనున్నారా అనే పలు అంశాలపై సర్వేలు చేసి పలు సంస్థలు ఫలితాలు వెల్లడించాయి. అయితే కొన్ని సందర్భాల్లో తప్పా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలాసార్లు నిజమయ్యాయి. తుది ఫలితాలు మార్చి 10న రానున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మణిపూర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి సీఎం బీరెన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టనున్నట్లు సర్వేల ఫలితాల్లో తేలింది. కాగా మణిపూర్‌లో 60 సీట్లకు రెండు విడతల్లో ( ఫిబ్రవరి 28, మార్చి 5) పోలింగ్ నిర్వహించారు. మొత్తం 60 సీటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 31 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పీపుల్స్ అనే సంస్థ బీజేపీ 25 నుంచి 29 స్థానాల వరకు గెలుచుకోనున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ 17 నుంచి 21 సీట్లు వరకు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలింది.
అదే విధంగా ఎన్‌పీపీ 7 నుంచి 11, ఎన్‌పీఎఫ్ 3 నుంచి 5, ఇతరులు 2 నుంచి అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందనున్నట్లు పీపుల్స్ పల్స్ పేర్కొంది. బీజేపీ 33 శాతం.. కాంగ్రెస్ 29 శాతం వరకు ఓట్లు సాధించవచ్చిని వెల్లడించింది. తాజా ఫలితాలను బట్టి మణిపూర్ ముఖ్యమంత్రి రేసులో బీరెన్ సింగ్ ముందు వరుసలో ఉన్నారు.
ఈ సారి కూడా ఆయనే సీఎం పీఠాన్ని అధిరోహించనున్నట్లు తెలుస్తోంది. మరి మణిపూర్ పోస్ట్ పోల్స్ ఫలితాలు.. తుది ఫలితాలకు అనుగుణంగా ఉంటాయా.. లేదా తలకిందులవుతాయా? తేలాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment