ఆయన ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ పొలిటికల్ గ్రౌండ్‌లో ప్రత్యర్థులతో ఫుట్‌బాల్ ఆడేయగలరు ఆయన ఒక జర్నలిస్టు కత్తి కంటే పదునైన తన కలం నుంచి వచ్చే మాటలతో విపక్షాలపై తూటాలు పేల్చగలరు ఆయన ఒక హ్యూమనిస్టు తీవ్రవాదంతో అల్లాడిపోయే రాష్ట్రంలో శాంతి స్థాపన చేయగలరు రాజకీయాల్లో ఆయనని ఓ మణిపూసగా అభిమానులు కీర్తిస్తారు మణిపూర్ బీజేపీ తొలి ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఈ ఎన్నికల్లో నెగ్గి మరోసారి సీఎం కావాలని వ్యూహాలు పన్నుతున్నారు.
►1963 సంవత్సరం జనవరి 1న జన్మించారు.
►చిన్నప్పట్నుంచి ఫుట్‌బాల్ అంటే ఆరోప్రాణం. ఈ క్రీడలో ప్రతిభ ఆధారంగానే సరిహద్దు భద్రతా దళం
(బీఎస్‌ఎఫ్)లో చేరారు. బీఎస్‌ఎఫ్ తరఫున ఎన్నో ఫుట్ బాల్ టోర్నీల్లో పాల్గొని విజయం సాధించారు.
►జర్నలిజం మీద మక్కువతో బీఎస్‌ఎఫ్‌కి రాజీనామా చేసి 1992 సంవత్సరంలో నహరోల్గి థౌండాంగ్ అనే పత్రికను స్థాపించారు. 2001 వరకు ఆ పత్రికకు ఎడిటర్‌గా పని చేశారు. ఆ పత్రిక అత్యంత ప్రజాదరణ పొందింది.
►తీవ్రవాదులకు మద్దతుగా కథనాలు రాస్తున్నారన్న ఆరోపణలపై 2000 సంవత్సరంలో బిరేన్ సింగ్ పత్రికా కార్యాలయంపై పోలీసులు దాడి చేసి దేశద్రోహం కేసు పెట్టారు.
►ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే తన అడుగులు మార్చుకోక తప్పదని భావించి 2002లో జర్నలిజం వదులుకొని రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
►డెమొక్రాటిక్ రివల్యూషనరీ పీపుల్స్ పార్టీ (డీఆర్‌పీపీ)లో చేరిన బిరేన్ సింగ్ 2002 అసెంబ్లీ ఎన్నికల్లో హెంగాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారు. అప్పట్నుంచి రాజకీయంగా వెనుతిరిగి చూడలేదు.
►2003లో మేలో కాంగ్రెస్‌లో చేరి రాష్ట్రానికి మంత్రి అయ్యారు. ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ నెగ్గుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ శాఖలకు మంత్రిగా పని చేశారు.
►కాంగ్రెస్ పార్టీలో అత్యంత శక్తిమంతుడు , మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఇక్రామ్ ఇబోబి సింగ్ వ్యవహార శైలి నచ్చక నిరంతరం అసమ్మతి గళం వినిపించేవారు. ఇబోబి సింగ్‌పైనే తిరుగుబాటు చేసి ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ ఓ ఉద్యమాన్నే నడిపారు. చివరికి ఇబోబి సింగే, బిరేన్‌ను కేబినెట్ నుంచి తప్పించారు.
►దీంతో శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టేసి 2016 అక్టోబర్‌లో బీజేపీలో చేరారు.
►2017 శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 21 సీట్లు మాత్రమే సాధించినప్పటికీ నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) మద్దతు కూడగట్టడంలో బిరేన్ సింగ్ విజయం సాధించారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.
►గత అయిదేళ్లలో ముఖ్యమంత్రిగా బిరేన్ సింగ్ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఉగ్రవాదుల దాడులు, రహదారుల దిగ్బంధనాలను సమర్థంగా అడ్డుకున్నారు.
►ఒక జర్నలిస్టు అయినప్పటికీ తనకి, బీజేపీకి వ్యతిరేకంగా రాసే పత్రికాధిపతులపై కేసులు పెట్టి నెగెటివిటీని మూటగట్టుకున్నారు.
►2020 జూన్‌లో బిరేన్ సింగ్ పని తీరునచ్చక ఎన్‌పీపీకి చెందిన నలుగురు సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆయనపై తిరుగుబాటు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు.
►బిరేన్ సింగ్ అవినీతి రహిత పరిపాలన, తీవ్రవాదం అణచివేత, ఈశాన్య రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసిన బీజేపీ తిరిగి ఈ సారి ఎన్నికల్లోనూ ఆయననే సారథిని చేసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment