దేశంలోని అతి కొద్దిమంది హ్యాట్రిక్ ముఖ్యమంత్రుల్లో ఒకరు.. మణిపూర్‌లో 30 మిలిటెంట్ గ్రూపులు చురుగ్గా ఉన్నప్పుడు సీఎం పీఠాన్ని ఎక్కి తీవ్రవాదాన్ని ఎదిరించి పోరాడిన శక్తిమంతుడు! సంకీర్ణ సర్కార్‌ని నడిపించడంలోనూ, అధికార వ్యతిరేకతను ఎదుర్కోవడంలోనూ.. తనకు సాటిపోటీ లేరని నిరూపించుకున్నారు. విజయాలు వస్తే పొంగిపోలేదు. పరాజయాలకు కుంగిపోలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగారు. తొమ్మిది మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లున్న కుటుంబంలో పెద్దన్నగా తన బాధ్యతల్ని సమర్థవంతంగా పోషించిన ఇబోబి అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దన్నగా అందరినీ కలుపుకొని వెళ్లడానికే తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బలమూ ఆయనే.. బలహీనత కూడా ఆయనే. మణిపూర్‌లో ప్రస్తుతప్రతిపక్ష నాయకుడు ఒక్రామ్ ఇబోబి సింగ్ మీద నమ్మకంతోనే మరోసారి కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఆయన నేతృత్వంలోనే సమరభేరి మోగించింది.
►ఒక్రామ్ ఇబోబి సింగ్ 1948 సంవత్సరం జూన్ 19న మణిపూర్‌లోని ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు
►ఇంఫాల్‌లోని డీఎం కాలేజీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నారు
►ఇబోబి సింగ్ భార్య లంధోని దేవి కూడా ఎమ్మెల్యే. వారికి ఒక కుమారుడు , ఒక కుమార్తె ఉన్నారు
►1981లో కోఆపరేటివ్ సొసైటీకి కార్యదర్శిగా ఇబోబి సింగ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది.
►1984లో తొలిసారిగా మణిపూర్ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా ఖంగాబాక్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏడాదికి కాంగ్రెస్‌లో చేరారు.
►1990లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పదవి చేపట్టారు.
►రాజకీయాల్లో ఎన్నో విజయాలు సాధించారు. మరెన్నో ఓటములు చవిచూశారు. వరసగా 1995, 2000 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
►ఓటమి ఎదురైనా కుంగిపోలేదు. మణిపూర్ కాంగ్రెస్‌లో ఎదిగారు. 1999లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు.
►2002లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 20 స్థానాలు వచ్చినప్పటికీ తొలిసారి ముఖ్యమంత్రి పీఠమెక్కారు. సీపీఐతో కలిసి సంకీర్ణ సర్కార్‌ని విజయవంతంగా నడిపించారు.
►అప్పట్నుంచి వరసగా మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టి హ్యాట్రిక్ సీఎంగా రికార్డులకెక్కారు. 2002–2017 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు.
►తీవ్రవాదంతో అతలాకుతలమయ్యే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో ఇబోబి సింగ్ కీలకపాత్ర పోషించారు. 2012లో అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పటికీ మొత్తం 60 స్థానాల్లో ఏకంగా 42 స్థానాల్లో కాంగ్రెస్‌ని గెలిపించి తన సత్తాచాటారు.
►2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటులో ఇబోబి సింగ్ విఫలమై ప్రతిపక్ష నాయకుడిగా పరిమితమయ్యారు.
►విపక్ష నాయకుడిగా ఆయన ట్రాక్ రికార్డు గాడి తప్పింది. ఈ అయిదేళ్లలో అసెంబ్లీలో బలం 28 నుంచి 15కి పడిపోయింది. వలసల్ని నివారించడంలోనూ, బీజేపీకి ఎదురొడ్డి నిలవడంలోనూ ఆయన విఫలమయ్యారు.
►ఇబోబి సీఎంగా ఉన్న 15 ఏళ్ల కాలంలో పదేళ్లు అధికారాన్ని కాపాడుకోవడానికి, మిలిటెంట్లకు ఎదురొడ్డి నిలబడడానికే సరిపోయింది.
►ఇబోబిపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. వాటి నుంచి కూడా బయటపడ్డారు. 2006, 2008లో మిలిటెంట్ గ్రూపులు ఆయన నివాసంపైనే దాడులు చేసినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు.
►ప్రభుత్వ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో 10శాతం వాటా తీసుకుంటారని వికీలీక్స్ ఆరోపణల్లో వెలుగులోకి వచ్చింది. 2006 సెప్టెంబర్‌లో వికీలీక్స్‌లో మిస్టర్ 10% అని ఇబోబిని సంబోధించినట్టు తెలుస్తోంది.
►మనీల్యాండరింగ్‌కు సంబంధించి 2020లో ఈడీ ఆయనపైనా, కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేసింది. రూ.332 కోట్ల డెవలప్‌మెంట్ సొసైటీ కుంభకోణాన్ని సీబీఐ విచారిస్తోంది.
►అనారోగ్య సమస్యలు, ఈడీ కేసులు, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో ఇబోబి సింగ్ గతంలో మాదిరిగా ఉత్సాహంగా లేరు. బీజేపీలోని అంతర్గత పోరే తమ పార్టీని గట్టెక్కిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇబోబికి మించిన నాయకుడెవరూ పార్టీలో దొరకక ఆయన సామర్థ్యం మీదే ఆశలు పెట్టుకుంది.
-నేషనల్ డెస్క్,సాక్షి
Comments
Please login to add a commentAdd a comment