అభివృద్ధి ఎజెండాతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న అధికార బీజేపీ అధికార వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే పనిలో కాంగ్రెస్ తీవ్రవాద సమస్యనే ప్రధాన బూచీగా
చూపిస్తూ ప్రాంతీయ పార్టీలు ఇలా ఎవరి దారిలో వారే నడుస్తూ మణిపూర్ ఎన్నికల్ని హీటెక్కిస్తున్నారు.
మణిపూర్ సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామ్య పక్షాలతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటున్న అధికార బీజేపీ ఈసారైనా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. టార్గెట్ 40+ సీట్లు లక్ష్యంగా అభివృద్ధి నినాదంతో ముందడుగు వేస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటేనే (కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండడం) మణిపూర్‌కు లాభమని ప్రధాని సహా బీజేపీ నేతలందరూ నొక్కి చెబుతున్నారు.
2017 ఎన్నికల్లో 21 సీట్లతో రెండోస్థానంలో నిలిచినా.. కేంద్రంలో అధికారంలో ఉన్నందువల్ల బీజేపీ రాష్ట్రంలో చక్రం తిప్పి మొదటిసారి మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల రూ.1,858 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.2,957 కోట్ల రూపాయలతో మరో తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు.
మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు మాత్రమే నెగ్గిన బీజేపీ బలం ఈ అయిదేళ్ల కాలంలో 29కి చేరుకుంది. సంకీర్ణ ప్రభుత్వ భాగపక్షాలైన నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)లతో విభేదాలున్నప్పటికీ వారితో కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా కమలదళం ఉంది. ముఖ్యమంత్రి ఎన్.బైరాన్ సింగ్ అభివృద్ధి, మోదీ చరిష్మాపైనే ఆశలతో ఉన్నారు. రాష్ట్ర్‌ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు శారదాదేవి అనే మహిళ సమర్థంగా నిర్వహించడం ఆ పార్టీకి కలిసి వస్తుందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తీవ్రవాద సమస్యే వారి ఎజెండా
బీజేపీ ప్రభుత్వానికి ఇన్నాళ్లూ మద్దతునిస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) ఈసారి ఎన్నికల్లో బీజేపీ హిందూత్వ ఎజెండాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నాగాలాండ్, మణిపూర్‌లలో పట్టున్న ఈ రెండు పార్టీలు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) మొత్తానికే రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
నాగాలాండ్‌లో ఇటీవల 14 మంది అమాయకులైన పౌరుల్ని కాల్చి చంపడం, గత ఏడాది నవంబర్ 13న చురచంద్‌పూర్ జిల్లాలోని సింఘాట్ వద్ద అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై తీవ్రవాదులు చేసిన మెరుపు దాడిలో కల్నల్ బిల్లవ్ త్రిపాఠి కుటుంబం ప్రాణాలు కోల్పోవడం, అక్కడక్కడ జరిగిన బాంబుదాడుల్ని చూపిస్తూ భద్రతనే ప్రధానంగా ప్రశ్నిస్తూ బీజేపీకి పక్కలో బల్లంలా మారారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. మణిపూర్ ఓటర్లు సాధారణంగా అటువైపు మొగ్గు చూపుతుంటారు.
దానితో పాటు బరిలో ఉన్న అభ్యర్థి సామర్థ్యాన్నీ చూస్తారు. అలాంటి చోట ఏఎఫ్‌ఎస్‌పీఏను రద్దు చేయాలన్న ఎజెండా ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనే సందేహాలున్నాయి. మేఘాలయ ముఖ్యమంత్రి కూడా అయిన ఎన్‌పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రచారంలో దూకుడుగా వెళుతున్నారు. ఇక ఎన్‌పీఎఫ్‌కి నాగా ప్రజల్లో గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో 4 సీట్లలో విజయం సాధించిన ఈ పార్టీ ఇప్పుడు 8 నుంచి 10 స్థానాల్లో గెలిచి కింగ్‌మేకర్ కావాలన్న ఆశతో ఉంది.
వలసలతో కాంగ్రెస్ కుదేల్
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అంతేకాకుండా వలసలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. గత అయిదేళ్ల కాలంలో సగానికి సగం మంది ఎమ్మెల్యేలు తగ్గిపోయారు. ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. వారిలో అత్యధికులు బీజేపీలో చేరారు.
దీంతో కాంగ్రెస్ బలం 14కి పడిపోయింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు గోవింద్ దాస్‌తో సహా పలువురు ప్రముఖులు పార్టీని వీడడంతో కాంగ్రెస్ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొం టోంది. ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మూడుసార్లు సీఎంగా చేసిన ఇబోబి సింగ్ కాంగ్రెస్‌ను ముందుండి నడపడంలో విఫలమవుతున్నారు. అయినప్పటికీ నిరుద్యోగ యువత తమవైపు ఉంటారన్న ఆత్మవిశ్వాసంతో ఆ పార్టీ ఉంది.
నిరుద్యోగ సమస్య
పర్వత ప్రాంతమైన మణిపూర్‌లో అక్షరాసత్య రేటు అత్యధికంగా 80% వరకు ఉంది. జాతీయ సగటు అక్షరాస్యత రేటు కంటే ఇది చాలా ఎక్కువ. అయినప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుతనం వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. నిరుద్యోగం రేటు 11.6% కాగా, ఎకనామిక్ సర్వే ఆఫ్ మణిపూర్ 2020–21 ప్రకారం 18–24 మధ్య వయసు గల వారిలో నిరుద్యోగులు 44.4 శాతం ఉన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడం కూడా అధికార బీజేపీపై వ్యతిరేకతను పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికార వ్యతిరేకతనే తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉంది.
ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఎన్నికలకు ముందు పార్టీల మధ్య పొత్తులు లేకపోయినా, ఎన్నికల తర్వాత పొత్తులు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కుదిరే పని కాదు. బీజేపీ హిందుత్వ కార్డుతో అసంతృప్తిగా ఉన్న ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్ పార్టీలతోనే కమలనాథులకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయి
– ప్రదీప్ ఫన్‌జోబమ్, ఎన్నికల విశ్లేషకుడు
Comments
Please login to add a commentAdd a comment