Opposition charges
-
బీజేపీపై తీవ్ర వ్యతిరేకత
న్యూఢిల్లీ: బీజేపీపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఒకే లక్ష్యంతో ఏకతాటిపై నిలబడితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి చాలా కష్టమవుతుందని జోస్యం చెప్పారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని జోడో యాత్రలో తెలుసుకున్నానన్నారు. ‘‘గతంలోలా వ్యూహాత్మక రాజకీయ పోరాటం ద్వారా, కొన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించడం అసాధ్యం. దేశమంతా ఒకే భావజాలం చేతుల్లో ఉంది. అదే దేశ రాజకీయాలపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. దాన్ని ఓడించేందుకు మరో భావజాలం కావాలి. ప్రజలకు ప్రత్యామ్నాయ జాతీయ విధానాన్ని చూపాలి. కాంగ్రెస్‌కు మినహా మిగతా ప్రాంతీయ పార్టీలకు అలాంటి విధానమేదీ లేదు’’ అన్నారు. బీజేపీయే గురువు! ఎప్పటికప్పుడు ఏం చేయకూడదో చెప్పే బీజేపీని గురువుగా భావిస్తానని రాహుల్ అన్నారు. కాంగ్రెస్‌పై బీజేపీ ఎంతగా దాడి చేస్తే దాని భావజాలాన్ని అంతగా అర్థం చేసుకుని ఎదురొడ్డి నిలుస్తుందన్నారు. ‘‘ప్రజలందరినీ ఏకం చేసేలా భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ రూపకల్పన చేసింది. విపక్షాలు రాజకీయ తదితర కారణాలతో యాత్రలో పాల్గొనకున్నా అవన్నీ యాత్రకు తోడుగా ఉన్నాయి. దూరంగా ఉండిపోతున్నట్లు వివరించారు. యాత్రలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికీ తలుపులు తెరిచి ఉంటాయన్నారు. కేంద్రం ఆరోపణలపై ధ్వజం ఢిల్లీలో జోడో యాత్ర సమయంలో సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించారన్న కేంద్రం ఆరోపణలను రాహుల్ తోసిపుచ్చారు. ‘‘ఇది ప్రజలతో మమేకమవుతూ చేసే పాదయాత్ర. బుల్లెట్ ప్రూఫ్ కార్లలో చేయడం అసాధ్యం. బీజేపీ నేతలు బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా చర్యలే లేవు. ప్రొటోకాల్స్ ఒక్కో పార్టీకి ఒక్కోలా ఉంటున్నాయి’’ అని ధ్వజమెత్తారు. -
‘డబుల్ ఇంజిన్’ స్పీడ్ ఎంత?
అభివృద్ధి ఎజెండాతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న అధికార బీజేపీ అధికార వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే పనిలో కాంగ్రెస్ తీవ్రవాద సమస్యనే ప్రధాన బూచీగా చూపిస్తూ ప్రాంతీయ పార్టీలు ఇలా ఎవరి దారిలో వారే నడుస్తూ మణిపూర్ ఎన్నికల్ని హీటెక్కిస్తున్నారు. మణిపూర్ సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామ్య పక్షాలతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటున్న అధికార బీజేపీ ఈసారైనా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. టార్గెట్ 40+ సీట్లు లక్ష్యంగా అభివృద్ధి నినాదంతో ముందడుగు వేస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటేనే (కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండడం) మణిపూర్‌కు లాభమని ప్రధాని సహా బీజేపీ నేతలందరూ నొక్కి చెబుతున్నారు. 2017 ఎన్నికల్లో 21 సీట్లతో రెండోస్థానంలో నిలిచినా.. కేంద్రంలో అధికారంలో ఉన్నందువల్ల బీజేపీ రాష్ట్రంలో చక్రం తిప్పి మొదటిసారి మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల రూ.1,858 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.2,957 కోట్ల రూపాయలతో మరో తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు మాత్రమే నెగ్గిన బీజేపీ బలం ఈ అయిదేళ్ల కాలంలో 29కి చేరుకుంది. సంకీర్ణ ప్రభుత్వ భాగపక్షాలైన నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)లతో విభేదాలున్నప్పటికీ వారితో కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా కమలదళం ఉంది. ముఖ్యమంత్రి ఎన్.బైరాన్ సింగ్ అభివృద్ధి, మోదీ చరిష్మాపైనే ఆశలతో ఉన్నారు. రాష్ట్ర్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు శారదాదేవి అనే మహిళ సమర్థంగా నిర్వహించడం ఆ పార్టీకి కలిసి వస్తుందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తీవ్రవాద సమస్యే వారి ఎజెండా బీజేపీ ప్రభుత్వానికి ఇన్నాళ్లూ మద్దతునిస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఈసారి ఎన్నికల్లో బీజేపీ హిందూత్వ ఎజెండాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నాగాలాండ్, మణిపూర్లలో పట్టున్న ఈ రెండు పార్టీలు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) మొత్తానికే రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. నాగాలాండ్‌లో ఇటీవల 14 మంది అమాయకులైన పౌరుల్ని కాల్చి చంపడం, గత ఏడాది నవంబర్ 13న చురచంద్‌పూర్ జిల్లాలోని సింఘాట్ వద్ద అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై తీవ్రవాదులు చేసిన మెరుపు దాడిలో కల్నల్ బిల్లవ్ త్రిపాఠి కుటుంబం ప్రాణాలు కోల్పోవడం, అక్కడక్కడ జరిగిన బాంబుదాడుల్ని చూపిస్తూ భద్రతనే ప్రధానంగా ప్రశ్నిస్తూ బీజేపీకి పక్కలో బల్లంలా మారారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. మణిపూర్ ఓటర్లు సాధారణంగా అటువైపు మొగ్గు చూపుతుంటారు. దానితో పాటు బరిలో ఉన్న అభ్యర్థి సామర్థ్యాన్నీ చూస్తారు. అలాంటి చోట ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలన్న ఎజెండా ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనే సందేహాలున్నాయి. మేఘాలయ ముఖ్యమంత్రి కూడా అయిన ఎన్పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రచారంలో దూకుడుగా వెళుతున్నారు. ఇక ఎన్‌పీఎఫ్‌కి నాగా ప్రజల్లో గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో 4 సీట్లలో విజయం సాధించిన ఈ పార్టీ ఇప్పుడు 8 నుంచి 10 స్థానాల్లో గెలిచి కింగ్‌మేకర్ కావాలన్న ఆశతో ఉంది. వలసలతో కాంగ్రెస్ కుదేల్ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అంతేకాకుండా వలసలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. గత అయిదేళ్ల కాలంలో సగానికి సగం మంది ఎమ్మెల్యేలు తగ్గిపోయారు. ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. వారిలో అత్యధికులు బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 14కి పడిపోయింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు గోవింద్ దాస్‌తో సహా పలువురు ప్రముఖులు పార్టీని వీడడంతో కాంగ్రెస్ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొం టోంది. ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మూడుసార్లు సీఎంగా చేసిన ఇబోబి సింగ్ కాంగ్రెస్‌ను ముందుండి నడపడంలో విఫలమవుతున్నారు. అయినప్పటికీ నిరుద్యోగ యువత తమవైపు ఉంటారన్న ఆత్మవిశ్వాసంతో ఆ పార్టీ ఉంది. నిరుద్యోగ సమస్య పర్వత ప్రాంతమైన మణిపూర్‌లో అక్షరాసత్య రేటు అత్యధికంగా 80% వరకు ఉంది. జాతీయ సగటు అక్షరాస్యత రేటు కంటే ఇది చాలా ఎక్కువ. అయినప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుతనం వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. నిరుద్యోగం రేటు 11.6% కాగా, ఎకనామిక్ సర్వే ఆఫ్ మణిపూర్ 2020–21 ప్రకారం 18–24 మధ్య వయసు గల వారిలో నిరుద్యోగులు 44.4 శాతం ఉన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడం కూడా అధికార బీజేపీపై వ్యతిరేకతను పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికార వ్యతిరేకతనే తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఎన్నికలకు ముందు పార్టీల మధ్య పొత్తులు లేకపోయినా, ఎన్నికల తర్వాత పొత్తులు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కుదిరే పని కాదు. బీజేపీ హిందుత్వ కార్డుతో అసంతృప్తిగా ఉన్న ఎన్పీపీ, ఎన్పీఎఫ్ పార్టీలతోనే కమలనాథులకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయి – ప్రదీప్ ఫన్జోబమ్, ఎన్నికల విశ్లేషకుడు -
11 తర్వాత శీతాకాల సమావేశాలు ప్రారంభం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి 14 తేదీల మధ్య ఏదో ఒక రోజు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. నిజానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ మూడో వారంలోనే ప్రారంభమవ్వాలి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా సమావేశాలు ప్రారంభం కావడం ఆలస్యమవుతోందని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. కాగా సమావేశాల తేదీల్ని నిర్ణయించే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇంకా భేటీ కాలేదు. డిసెంబర్ 9, 14 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 11– 14 మధ్యలో ప్రారంభం కావచ్చని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. సభ నిర్వహణకు కేంద్రం సుముఖంగా లేదని, శీతాకాల సమావేశాల్ని రద్దు చేసే ఆలోచనలో ఉందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలుచేశాయి. -
మా వాళ్లు రాజీనామా చేయరు!
లలిత్ వ్యవహారంలో సుష్మ, రాజేలకు బీజేపీ బాసట * విపక్ష ఆరోపణలు హాస్యాస్పదమని వ్యాఖ్య న్యూఢిల్లీ: లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు మద్దతుగా ఇప్పటివరకు నోరువిప్పని బీజేపీ నాయకత్వం ఎట్టకేలకు మౌనం వీడింది. వసుంధర రాజే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని శుక్రవారం తేల్చి చెప్పింది. విపక్ష అవినీతి ఆరోపణలను తిప్పికొడుతూ.. రాజే విషయంలో కానీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విషయంలో కానీ అవినీతి, అక్రమాలేవీ చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. మరోవైపు, విపక్ష కాంగ్రెస్ పట్టు వీడటం లేదు. ఆ ఇద్దరు నేతలు రాజీనామా చేయడమో, లేక వారిద్దరిని పదవుల నుంచి తొలగించడమో చేయకపోతే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడ్డుకుని తీరుతామని హెచ్చరించింది. లలిత్ మోదీతో ప్రధాని మోదీకి కూడా సంబంధాలున్నాయంటూ ఆరోపించింది. బాసటగా నిలిచేందుకే నిర్ణయం మనీ లాండరింగ్ సహా తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ, లండన్ పరారైన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విషయంలో వసుంధర రాజే సహకరించారన్న వార్తలు వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం లేచిన విషయం తెలిసిందే. ఈ అంశం తీవ్రమై.. ప్రభుత్వ, పార్టీ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి రావడంతో ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. మొదట కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని మోదీ.. ఆ తరువాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ సుదీర్ఘ మంతనాలు జరిపారు. అనంతరం విపక్ష డిమాండ్లకు తలొగ్గకూడదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దాంతో సీనియర్ నేతలు సుష్మ, రాజేలకు పార్టీ తరఫున మద్దతు ప్రకటించే బాధ్యతను అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదీకి అప్పగించారు. ఆయన శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆ ఇద్దరు సీనియర్ నేతలకు పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు. విపక్ష ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. పార్టీ అగ్ర నాయకత్వానికి రాజే వివరణ ఇచ్చారన్నారు. కాగా, పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ పర్యటనను శుక్రవారం వసుంధర రాజే రద్దు చేసుకున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్‌కు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షాలు కూడా వెళ్తున్న నేపథ్యంలో.. వారిని ముఖాముఖి కలవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆమె తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ‘యోగా డే తరువాతైనా చర్య తీసుకోండి’ ‘‘యోగా డే తరువాతైనా, ‘లలితాసన్’ తరువాతైనా ఈ విషయంలో ప్రధాని కఠిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామ’ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యంగ్యంగా అన్నారు. పార్లమెంట్ వర్షాకాల భేటీలు సజావుగా సాగాలంటే.. సుష్మ, రాజేలు రాజీనామా చేయడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదన్నారు. లలిత్‌కు ఇద్దరు పార్టీ సీనియర్ నేతలు సహకారం అందించే విషయం ప్రధానికి తెలుసని మరో నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు.