మా వాళ్లు రాజీనామా చేయరు!
లలిత్ వ్యవహారంలో సుష్మ, రాజేలకు బీజేపీ బాసట
* విపక్ష ఆరోపణలు హాస్యాస్పదమని వ్యాఖ్య
న్యూఢిల్లీ: లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు మద్దతుగా ఇప్పటివరకు నోరువిప్పని బీజేపీ నాయకత్వం ఎట్టకేలకు మౌనం వీడింది. వసుంధర రాజే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని శుక్రవారం తేల్చి చెప్పింది. విపక్ష అవినీతి ఆరోపణలను తిప్పికొడుతూ.. రాజే విషయంలో కానీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విషయంలో కానీ అవినీతి, అక్రమాలేవీ చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది.
మరోవైపు, విపక్ష కాంగ్రెస్ పట్టు వీడటం లేదు. ఆ ఇద్దరు నేతలు రాజీనామా చేయడమో, లేక వారిద్దరిని పదవుల నుంచి తొలగించడమో చేయకపోతే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడ్డుకుని తీరుతామని హెచ్చరించింది. లలిత్ మోదీతో ప్రధాని మోదీకి కూడా సంబంధాలున్నాయంటూ ఆరోపించింది.
బాసటగా నిలిచేందుకే నిర్ణయం
మనీ లాండరింగ్ సహా తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ, లండన్ పరారైన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విషయంలో వసుంధర రాజే సహకరించారన్న వార్తలు వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం లేచిన విషయం తెలిసిందే. ఈ అంశం తీవ్రమై.. ప్రభుత్వ, పార్టీ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి రావడంతో ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. మొదట కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని మోదీ.. ఆ తరువాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ సుదీర్ఘ మంతనాలు జరిపారు.
అనంతరం విపక్ష డిమాండ్లకు తలొగ్గకూడదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దాంతో సీనియర్ నేతలు సుష్మ, రాజేలకు పార్టీ తరఫున మద్దతు ప్రకటించే బాధ్యతను అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదీకి అప్పగించారు. ఆయన శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆ ఇద్దరు సీనియర్ నేతలకు పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు. విపక్ష ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. పార్టీ అగ్ర నాయకత్వానికి రాజే వివరణ ఇచ్చారన్నారు. కాగా, పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ పర్యటనను శుక్రవారం వసుంధర రాజే రద్దు చేసుకున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్‌కు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షాలు కూడా వెళ్తున్న నేపథ్యంలో.. వారిని ముఖాముఖి కలవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆమె తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
‘యోగా డే తరువాతైనా చర్య తీసుకోండి’
‘‘యోగా డే తరువాతైనా, ‘లలితాసన్’ తరువాతైనా ఈ విషయంలో ప్రధాని కఠిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామ’ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యంగ్యంగా అన్నారు. పార్లమెంట్ వర్షాకాల భేటీలు సజావుగా సాగాలంటే.. సుష్మ, రాజేలు రాజీనామా చేయడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదన్నారు. లలిత్‌కు ఇద్దరు పార్టీ సీనియర్ నేతలు సహకారం అందించే విషయం ప్రధానికి తెలుసని మరో నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు.