ఆ పెట్టుబడులు రాజే ఖాతాలోకే!
దుష్యంత్ సింగ్ కంపెనీలో వసుంధర రాజేకు షేర్లు
♦ లలిత్ మోదీ పెట్టుబడులతోనే ఆ వాటాలని ఆరోపణలు
♦ రాజస్తాన్ సీఎంకు మద్దతు పునరుద్ఘాటించిన బీజేపీ
♦ లండన్‌లో ప్రియాంక గాంధీ దంపతులను కలిశానని లలిత్ ట్వీట్
న్యూఢిల్లీ/జైపూర్: లలిత్ మోదీ వ్యవహారంలో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు తాజాగా మరో ముప్పు ముంచుకొచ్చింది. రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ కంపెనీలో లలిత్ పెట్టిన పెట్టుబడుల లబ్ధిదారు రాజేనే అనే వార్త శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
దుష్యంత్‌కు చెందిన కంపెనీ నియంత్ హెరిటేజ్ హోటల్స్‌లో లలిత్ అత్యధిక ప్రీమియంతో రూ. 11 కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు పెట్టిన విషయం కొన్ని రోజుల క్రితం బయటపడి, రాజకీయ దుమారం రేగడం తెలిసిందే. రాజే ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనకు నియంత్ హెరిటేజ్ హోటల్స్‌లో 3,280 షేర్లు ఉన్నట్లు తెలిపారు. ఆ షేర్లు లలిత్ పెట్టుబడుల పర్యవసానమేనని ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆ షేర్లను దుష్యంత్, ఆయన భార్య నీహారికలు రాజేకు జన్మదిన కానుకగా ఇచ్చారని బీజేపీ రాజస్తాన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అశోక్ పర్నమీ తెలిపారు. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఢిల్లీలోని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానించాయి. నియంత్ హోటల్స్ సంస్థ 2009లో లలిత్ నుంచి చెక్ ద్వారా రూ. 4 కోట్ల రుణం, తర్వాత 2010లో రూ. 7.5 కోట్ల రుణం తీసుకుందన్నాయి.
రాజీనామా అవసరం లేదు
లలిత్ వ్యవహారంలో తమ పార్టీ సీనియర్ నేత రాజేకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆమె రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘రాజేకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. బీజేపీలోని ప్రజాకర్షక నేతలను కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది’ అని పార్టీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ అన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తొలుత ప్రధాని మోదీతోనూ, అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోనూ భేటీ అయ్యాక శర్మ ఈ ప్రకటన చేశారు. వారిద్దరితో జైట్లీ లలిత్ వివాదం, ప్రభుత్వం, పార్టీపై పడే ప్రభావం, న్యాయపరమైన సమస్యలు.. తదితరాలపై లోతుగా చర్చించినట్లు సమాచారం.
రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడలేదని, రాజే రాజీనామా చేయబోరని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. రాజస్తాన్ బీజేపీ శాఖ కూడా రాజేపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. దశాబ్దాలుగా సత్సంబంధాలు నెలకొని ఉన్న రాజే- లలిత్ మోదీ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ఈ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ అశోక్ పర్నమి విమర్శించారు. లలిత్ మోదీ ఇమిగ్రేషన్‌కు సంబంధించి అఫిడవిట్‌పై రాజే సంతకం చేసిన విషయం వాస్తవమే అయినప్పటికీ.. అదొక ముసాయిదా డాక్యుమెంట్ అని, దాన్ని యూకేలోని ఏ కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టలేదని, యూకేలోని ఏ కోర్టు ముందూ రాజే హాజరు కాలేదని ఆయన గుర్తు చేశారు.
నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కక్షసాధింపునకు పాల్పడుతుందన్న ఆలోచనతోనే ఆ పత్రాన్ని రహస్యంగా ఉంచాలని రాజే కోరారన్నారు. తనకు మద్దతుగా 120 మంది ఎమ్మెల్యేల సంతకాలను సేకరించారన్న వార్తలను రాజే ఖండించారు. ప్రతీ శుక్రవారం సీఎం నిర్వహించే ప్రజా దర్బార్‌లో, తమ నియోజకవర్గ సమస్యలను విన్నవించేందుకు పలువురు ఎమ్మెల్యేలు రావడాన్ని మీడియా ఈ విధంగా వక్రీకరించిందని సీఎం కార్యాలయం తెలిపింది. కాగా, నీతి ఆయోగ్ భేటీ కోసం రాజే శనివారం ఢిల్లీ వెళ్తున్నారు.
ప్రియాంక, వాద్రాలను కలవడం వెరీ హ్యాపీ
లలిత్ మోదీ ట్వీట్
కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలను తాను లండన్‌లో కలిసినట్లు లలిత్ మోదీ చేసిన ట్వీట్ బీజేపీకి అందివచ్చింది. ‘లండన్‌లోని ఓ రెస్టారెంట్లో ప్రియాంక, వాద్రాలను అనుకోకుండా కలవడం సంతోషంగా ఉంది’ అంటూ లలిత్ ట్వీట్ చేశారు. గాంధీ కుటుంబంతో లలిత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే యూపీఏ హయాంలో మోదీని భారత్‌కు రప్పించలేదని బీజేపీ ఆరోపించింది. దీనిపై సోనియా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
పెద్ద మోదీకి చిన్న మోదీ సాయం
లలిత్ వివాదంలోకి సోనియా కుటుంబాన్ని లాగడంపై కాంగ్రెస్ మండిపడింది. ‘అబద్ధాలతో చిన్న మోదీ(లలిత్ మోదీ) పెద్ద మోదీ(ప్రధాని మోదీ)కి సహకరిస్తున్నారు. రాజే, సుష్మ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్, ఇతర కీలకాంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చిన్న మోదీ ఈ ట్వీట్లు చేస్తున్నారు’ అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జెవాలా విమర్శించారు. రెస్టారెంట్లో ప్రియాంక, వాద్రాలను లలిత్ కలవడంపై స్పందిస్తూ.. ‘అనుకోకుండా రెస్టారెంట్లో ఎదురుపడడమేమన్నా నేరమా?’ అని ప్రశ్నించారు. రాజస్తాన్‌లో కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి అవగాహన ఒప్పందంలో ‘క్విడ్ ప్రొ కో’ ఉందన్నారు. ‘లలిత్‌తో ప్రియాంక మర్యాదపూర్వకంగా కూడా ఏనాడూ సమావేశం కాలేద’ని ప్రియాంక కార్యాలయం పేర్కొంది.