లలిత్‌కు ‘పద్మ’ సిఫార్సు!
మరో వివాదంలో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే
రాజేపై విరుచుకుపడ్డ కాంగ్రెస్.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
జైపూర్: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. లలిత్‌మోదీకి పద్మ పురస్కారం ఇవ్వాలంటూ ఆమె 2007లో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు ఇప్పుడు బయటకు రావడంతో రాజేకు మరో తలనొప్పి ఎదురైంది.
రాజస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి, అలాగే క్రీడారంగానికి లలిత్ మోదీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరును పద్మ పురస్కారానికి సిఫార్సు చేయాలని రాజస్తాన్ రాష్ట్ర క్రీడా మండలి(ఆర్‌ఎస్‌ఎస్‌సీ)కి సూచించినట్టుగా బుధవారం వార్తలు వెలువడ్డాయి. అయితే ముఖ్యమంత్రి మీడియా సలహాదారు ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించారు. కాగా, దీనిపై రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సీఏ) మాజీ గౌరవ కార్యదర్శి సుభాష్ జోషి స్పందిస్తూ.. అప్పట్లో ఆర్‌సీఏ అధ్యక్షునిగా, బీసీసీఐ ఉపాధ్యక్షునిగా ఉన్న లలిత్ మోదీ పేరును పద్మ అవార్డులకు సిఫార్సు చేసేందుకుగానూ ఆయనకు సంబంధించిన వివరాలు, పత్రాలు అందించాలని జూలై 27, 2007న ఆర్‌ఎస్‌ఎస్‌సీ నుంచి తమకు లేఖ అందిందని చెప్పారు.
అనంతరం కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రధాన కార్యదర్శికి ఆర్‌ఎస్‌ఎస్‌సీ పద్మ పురస్కారానికి లలిత్‌మోదీ పేరు సిఫార్సు చేస్తూ ప్రతిపాదన పంపిందని చెప్పారు. అయితే కేంద్రం రాజస్తాన్ ప్రభుత్వ సిఫార్సును పట్టించుకోలేదు. కాగా, ఈ వ్యవహారంలో వసుంధరా రాజేపై రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో లలిత్‌మోదీ సంస్థాగత అవినీతికి పాల్పడ్డాడని, లలిత్‌మోదీ పేరును పద్మ అవార్డుకు సిఫార్సు చేయడంతో రాజేకు, లలిత్‌మోదీకి ఉన్న బంధం మరోసారి బయటపడిందని చెప్పారు. వసుంధర రాజే తక్షణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.