ఆ రాజసౌధంపై సవాల్ కు సిద్ధమా?
జైపూర్:ధోల్‌పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిలో భాగమని.. ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీలు కలిసి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్‌గా మార్చారన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ సవాల్ విసిరిన బీజేపీ.. ధోల్ పూర్ ప్యాలెస్ వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఆస్తిగా స్పష్టం చేసింది. దీనిపై తాము విసిరిన ఛాలెంజ్ కు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? అని పార్టీ చీఫ్ అశోక్ పర్నామీ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆ ప్యాలెస్ కు చెందిన డాక్యుమెంట్లను, కోర్టు, కుటుంబ సంబంధిత సెటిల్ మెంట్ పేపర్లను ఆయన మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
ధోల్ పూర్ ప్యాలెస్ పూర్తిగా దుశ్యంత్ కు చెందిన ఆస్తిగానే ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తూ, నీచమైన రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. అవసరమైతే ఆర్టీఐ నుంచి డాక్యుమెంట్లను తెప్పించుకుని పరీక్షించుకోవచ్చని అశోక్ పేర్కొన్నారు. ఒకవేళ ప్యాలెస్ కు సంబంధించి ఎటువంటి అవతవకలకు పాల్పడినా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారని ప్రశ్నించారు.
రాజే.. లలిత్‌తో కలసి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ సౌధం రాజస్తాన్ ప్రభుత్వ ఆస్తి అని రాజే మాజీ భర్త హేమంత్‌సింగ్ ఒక కోర్టులో అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సోమవారం ఢిల్లీలో విలేకర్లకు చెప్పారు. 1954 - 2010 మధ్య కాలానికి సంబంధించిన రెవెన్యూ శాఖ పత్రాలు కొన్ని.. ధోల్‌పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని చూపుతున్నాయని.. కానీ ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండా రాజే, లలిత్‌లు కలిసి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్‌గా మార్చారని, రూ. 100 కోట్లు పెట్టుబడులుగా పెట్టారని చెప్పారు.