రాజసౌధాన్ని ఆక్రమించారు | Palace issue: Prove allegation, BJP dares Jairam Ramesh | Sakshi
Sakshi News home page

రాజసౌధాన్ని ఆక్రమించారు

Published Tue, Jun 30 2015 12:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రాజసౌధాన్ని ఆక్రమించారు - Sakshi

రాజసౌధాన్ని ఆక్రమించారు

వసుంధర, లలిత్‌మోదీలపై కాంగ్రెస్ దాడి తీవ్రం
* ధోల్‌పూర్ ప్యాలెస్‌ను అక్రమంగా ఆక్రమించారని జైరాం రమేష్ ధ్వజం
* ఆ ప్యాలెస్‌లోని హోటల్‌లో రాజే, ఆమె కుమారుడు దుష్యంత్, కోడలితో పాటు లలిత్‌మోదీకీ వాటాలు ఉన్నాయని ఆరోపణలు
* రాజే ఎన్నికల అఫిడవిట్‌లోనే ఈ విషయం చెప్పారని వెల్లడి

న్యూఢిల్లీ/జైపూర్: లలిత్ మోదీ వివాదంలో చిక్కుకున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై కాంగ్రెస్ సరికొత్త ఆరోపణలతో ఒత్తిడి తీవ్రం చేసింది.

ధోల్‌పూర్ రాజసౌధాన్ని(ప్యాలెస్‌ను) రాజే.. లలిత్‌తో కలసి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్నారని ఆరోపించింది. ఆ సౌధం రాజస్తాన్ ప్రభుత్వ ఆస్తి అని రాజే మాజీ భర్త హేమంత్‌సింగ్ ఒక కోర్టులో అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సోమవారం ఢిల్లీలో విలేకర్లకు చెప్పారు. 1954 - 2010 మధ్య కాలానికి సంబంధించిన రెవెన్యూ శాఖ పత్రాలు కొన్ని.. ధోల్‌పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని చూపుతున్నాయని.. కానీ ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండా రాజే, లలిత్‌లు కలిసి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్‌గా మార్చారని, రూ. 100 కోట్లు పెట్టుబడులుగా పెట్టారని  చెప్పారు.

అయితే.. ఇది రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 2009 సంవత్సరానికి ముందు జరగటం గమనార్హం. నియత్ హెరిటేజ్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో.. తన కుమారుడు, ఎంపీ అయిన దుష్యంత్ సింగ్, కోడలు నీహారిక, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీలతో పాటు తనకూ వాటాలు ఉన్నాయని రాజే 2013 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని రమేష్ తెలిపారు. ఆ సంస్థలో రాజేకు 3,280 షేర్లు, ఆమె కుమారుడికి 3,225 షేర్లు, కోడలికి మరో 3,225 షేర్లు, లలిత్‌కు చెందిన ఆనంద హెరిటేజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 815 షేర్లు ఉన్నాయని అఫిడవిట్ చూపుతోందన్నారు.  

ఇది.. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు లలిత్‌కు  రాజేకు మధ్య వ్యాపార సంబంధం, భాగస్వామ్యం, పన్నుల భారం లేని ప్రాంతం నుంచి విదేశీ పెట్టుబడులు పెట్టటాన్ని నిర్ధారిస్తోందని జైరాం పేర్కొన్నారు. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు లలిత్‌మోదీ మారిషస్ మార్గాన్ని వినియోగించుకున్నారని ఆరోపించారు. లలిత్‌గేట్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనాన్ని కొనసాగించటాన్ని ఎద్దేవా చేస్తూ ఆయనను ‘స్వామి మౌనానంద బాబా’గా జైరాం అభివర్ణించారు.
 
ప్యాలెస్ యజమాని దుష్యంత్‌సింగే: బీజేపీ

జైరాం ఆరోపణలను.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేంద్ర రాథోడ్‌లు జైపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ తిరస్కరించారు. ఈ రాజసౌధాన్ని హేమంత్‌సింగ్.. వసుంధర కుమారుడు దుష్యంత్‌సింగ్‌కు అప్పగించారని స్పష్టంగా చెప్తున్నాయంటూ పలు పత్రాలను ప్రదర్శించారు. రాజే ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పది రోజులుగా ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వపు సాధారణ పరిపాలన విభాగం 1956 డిసెంబర్‌లో ఒక నోటిఫికేషన్‌లో, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో.. ధోల్‌పూర్ ప్యాలెస్‌కు చట్టబద్ధ వారసుడిగా మహారాజా రాణా హేమంత్‌సింగ్ (దుష్యంత్ తండ్రి)ను ప్రకటించారని వివరించారు. అనంతరం 2007లో భరత్‌పూర్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ధోల్‌పూర్ ప్యాలస్‌ను దుష్యంత్‌కు అనుకూలంగా నిర్ణయించిందని.. దీనికి సంబంధించి హేమంత్‌సింగ్ డిక్రీ ఇచ్చారని, అది రిజిస్టరు కూడా అయిందని తెలిపారు.

మునిసిపల్ పత్రాల్లో సైతం ఆ ప్యాలెస్ యజమానిగా దుష్యంత్ పేరునే పేర్కొన్నారని చూపారు. ధోల్‌పూర్ ప్యాలెస్‌పై యాజమాన్య హక్కులు దుష్యంత్‌కు ఉన్నాయనేందుకు తమ వద్ద ఆధారాలన్నీ ఉన్నాయని.. దీనికి సంబంధించి వాస్తవాలు తెలియకుండా సీఎంపై, ఆమె కుటుంబ సభ్యులపై జైరాం రమేష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తప్పుపట్టారు.
 
జవాబులెందుకు నిలిపేశారు?: చిదంబరం

న్యూఢిల్లీ: లలిత్‌మోదీ గేట్ అంశంపై ఆర్టీఐ చట్టం కింద తాను అడిగిన ఏడు ప్రశ్నలకు సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని విదే శాంగ శాఖ జవాబులను ఎందుకు నిలిపివేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం సోమవారం ట్విటర్‌లో ప్రశ్నించారు. ప్రశ్నలకు సమాధానాలను నిలిపివేసిన విషయం మంత్రి సుష్మకు తెలుసా అని కూడా ఆయన ప్రశ్నించారు. లలిత్ పాస్‌పోర్టు పునరుద్ధరణ వివాదంపై సమాచారమిచ్చేందుకు విదేశాంగ శాఖ నిరాకరించిందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో చిదంబరం పై ప్రశ్నలు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement