అందుకే సమావేశాల చివర్లో లలిత్ మోదీ అంశంపై చర్చ: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా లలిత్ మోదీ అంశంపై పార్లమెంట్ సమావేశాల చివర్లో చర్చ చేపట్టిందని కాంగ్రెస్ విమర్శించింది. లలిత్‌గేట్, వ్యాపం స్కాంలపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తాయని తెలిసే ఆ విషయంపై చివరి వరకూ ప్రభుత్వం చర్చను చేపట్టలేదని ఆరోపించింది. ప్రభుత్వం ఒత్తిడి చేయబట్టే మరో రోజులో సమావేశాలు ముగుస్తాయనగా లలిత్ వ్యవహారంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు అనుమతిచ్చారని విమర్శించింది.
లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మలికార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచి వాయిదా తీర్మానం ద్వారా తాము చర్చకు పట్టుబడితే తిరస్కరించిన స్పీకర్.. మరో రోజులో సమావేశాలు ముగుస్తాయనగా అదే వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతివ్వడం ఆశ్చర్యపరిచిందన్నారు. దీనిని బట్టే స్పీకర్‌పై ప్రభుత్వం ఏ మేరకు ఒత్తిడి తెచ్చిందనేది అర్థమవుతుందన్నారు. మంత్రి సుష్మ వినతి, మరో మంత్రి వెంకయ్య మద్దతుతో వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టారని చెప్పారు. ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో అప్పటికప్పుడు చర్చకు స్పీకర్ అంగీకరించారన్నారు. తమ సాయంతో పలు బిల్లులు పాస్ అయ్యాయని, కానీ ప్రభుత్వం ఇప్పుడు తమను లక్ష్యంగా చేసుకుందన్నారు. తమ పార్టీని బ్రిటిష్ సామ్రాజ్యమే ఏమీ చేయలేకపోయిందని, బీజేపీ ఎంతని పేర్కొన్నారు.
స్పీకర్‌పై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది..
Published Sat, Aug 15 2015 3:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement