'బర్త్ డే కూడా జరపలేదు.. వీళ్లా మాట్లాడేది'
బెంగళూరు: నెహ్రూ ఫిలసఫీ మీద నమ్మకం లేనివాళ్లకు ఆయన పేరును ప్రస్తావించే అర్హతగానీ, ఆయన వారసత్వాన్ని చెప్పుకునే హక్కుగానీ లేదని కాంగ్రెస్ పార్టీ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే పార్లమెంటు సమావేశాలు ఎలాంటి ఫలితాలనివ్వకుండా ఊడ్చుకొనిపోయాయని పేర్కొన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. ఆ వెంటనే నెహ్రూ అంశాన్ని ముందుకు తెచ్చి ఆయనను పొగిడారు.
ఎంతో సముచితమైన వాతావరణంలో పార్లమెంటు వ్యవహారాలు ముందుకు తీసుకెళ్లి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలోనే నెహ్రూ చక్కటి పునాది వేశారని, కానీ ఆయన అనంతరం వారసులుగా చెప్పుకుంటున్న నేటి కాంగ్రెస్ నేతలు మాత్రం వారి పూర్వీకులు(నెహ్రూ) తీసుకొచ్చిన సంప్రదాయాలను పాడుచేశారని అరుణ్ జైట్లీ తన బ్లాగ్ లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మల్లిఖార్జున్ ఖర్గేను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తాము ఎన్నోసార్లు బ్రతిమాలినా నెహ్రూ 125వ జయంతి ఉత్సవాలను సరైన విధంగా బీజేపీ నిర్వహించలేదని, అలాంటివారికి ఇప్పుడు ఆయన పేరును వాడుకునే హక్కుగానీ, మాట్లాడే అర్హతగానీ లేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించిన భాషపై కూడా ఆయన స్పందిస్తూ కేజ్రీవాల్ బీజేపీ ప్రొడక్టే అన్నారు.'అరవింద్ కేజ్రీవాల్ను తయారుచేసింది పరోక్షంగా బీజేపీనే. దీనిపై నేను ఇంతకంటే ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే అతడు(కేజ్రీవాల్) బీజేపీ ప్రొడక్టే' అని ఖర్గే అన్నారు.