Lalit Modi affair
-
ఆ పెట్టుబడులు రాజే ఖాతాలోకే!
దుష్యంత్ సింగ్ కంపెనీలో వసుంధర రాజేకు షేర్లు ♦ లలిత్ మోదీ పెట్టుబడులతోనే ఆ వాటాలని ఆరోపణలు ♦ రాజస్తాన్ సీఎంకు మద్దతు పునరుద్ఘాటించిన బీజేపీ ♦ లండన్‌లో ప్రియాంక గాంధీ దంపతులను కలిశానని లలిత్ ట్వీట్ న్యూఢిల్లీ/జైపూర్: లలిత్ మోదీ వ్యవహారంలో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు తాజాగా మరో ముప్పు ముంచుకొచ్చింది. రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ కంపెనీలో లలిత్ పెట్టిన పెట్టుబడుల లబ్ధిదారు రాజేనే అనే వార్త శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దుష్యంత్‌కు చెందిన కంపెనీ నియంత్ హెరిటేజ్ హోటల్స్‌లో లలిత్ అత్యధిక ప్రీమియంతో రూ. 11 కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు పెట్టిన విషయం కొన్ని రోజుల క్రితం బయటపడి, రాజకీయ దుమారం రేగడం తెలిసిందే. రాజే ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనకు నియంత్ హెరిటేజ్ హోటల్స్‌లో 3,280 షేర్లు ఉన్నట్లు తెలిపారు. ఆ షేర్లు లలిత్ పెట్టుబడుల పర్యవసానమేనని ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆ షేర్లను దుష్యంత్, ఆయన భార్య నీహారికలు రాజేకు జన్మదిన కానుకగా ఇచ్చారని బీజేపీ రాజస్తాన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అశోక్ పర్నమీ తెలిపారు. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఢిల్లీలోని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానించాయి. నియంత్ హోటల్స్ సంస్థ 2009లో లలిత్ నుంచి చెక్ ద్వారా రూ. 4 కోట్ల రుణం, తర్వాత 2010లో రూ. 7.5 కోట్ల రుణం తీసుకుందన్నాయి. రాజీనామా అవసరం లేదు లలిత్ వ్యవహారంలో తమ పార్టీ సీనియర్ నేత రాజేకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆమె రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘రాజేకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. బీజేపీలోని ప్రజాకర్షక నేతలను కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది’ అని పార్టీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ అన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తొలుత ప్రధాని మోదీతోనూ, అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోనూ భేటీ అయ్యాక శర్మ ఈ ప్రకటన చేశారు. వారిద్దరితో జైట్లీ లలిత్ వివాదం, ప్రభుత్వం, పార్టీపై పడే ప్రభావం, న్యాయపరమైన సమస్యలు.. తదితరాలపై లోతుగా చర్చించినట్లు సమాచారం. రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడలేదని, రాజే రాజీనామా చేయబోరని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. రాజస్తాన్ బీజేపీ శాఖ కూడా రాజేపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. దశాబ్దాలుగా సత్సంబంధాలు నెలకొని ఉన్న రాజే- లలిత్ మోదీ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ఈ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ అశోక్ పర్నమి విమర్శించారు. లలిత్ మోదీ ఇమిగ్రేషన్‌కు సంబంధించి అఫిడవిట్‌పై రాజే సంతకం చేసిన విషయం వాస్తవమే అయినప్పటికీ.. అదొక ముసాయిదా డాక్యుమెంట్ అని, దాన్ని యూకేలోని ఏ కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టలేదని, యూకేలోని ఏ కోర్టు ముందూ రాజే హాజరు కాలేదని ఆయన గుర్తు చేశారు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కక్షసాధింపునకు పాల్పడుతుందన్న ఆలోచనతోనే ఆ పత్రాన్ని రహస్యంగా ఉంచాలని రాజే కోరారన్నారు. తనకు మద్దతుగా 120 మంది ఎమ్మెల్యేల సంతకాలను సేకరించారన్న వార్తలను రాజే ఖండించారు. ప్రతీ శుక్రవారం సీఎం నిర్వహించే ప్రజా దర్బార్‌లో, తమ నియోజకవర్గ సమస్యలను విన్నవించేందుకు పలువురు ఎమ్మెల్యేలు రావడాన్ని మీడియా ఈ విధంగా వక్రీకరించిందని సీఎం కార్యాలయం తెలిపింది. కాగా, నీతి ఆయోగ్ భేటీ కోసం రాజే శనివారం ఢిల్లీ వెళ్తున్నారు. ప్రియాంక, వాద్రాలను కలవడం వెరీ హ్యాపీ లలిత్ మోదీ ట్వీట్ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలను తాను లండన్‌లో కలిసినట్లు లలిత్ మోదీ చేసిన ట్వీట్ బీజేపీకి అందివచ్చింది. ‘లండన్‌లోని ఓ రెస్టారెంట్లో ప్రియాంక, వాద్రాలను అనుకోకుండా కలవడం సంతోషంగా ఉంది’ అంటూ లలిత్ ట్వీట్ చేశారు. గాంధీ కుటుంబంతో లలిత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే యూపీఏ హయాంలో మోదీని భారత్‌కు రప్పించలేదని బీజేపీ ఆరోపించింది. దీనిపై సోనియా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. పెద్ద మోదీకి చిన్న మోదీ సాయం లలిత్ వివాదంలోకి సోనియా కుటుంబాన్ని లాగడంపై కాంగ్రెస్ మండిపడింది. ‘అబద్ధాలతో చిన్న మోదీ(లలిత్ మోదీ) పెద్ద మోదీ(ప్రధాని మోదీ)కి సహకరిస్తున్నారు. రాజే, సుష్మ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్, ఇతర కీలకాంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చిన్న మోదీ ఈ ట్వీట్లు చేస్తున్నారు’ అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జెవాలా విమర్శించారు. రెస్టారెంట్లో ప్రియాంక, వాద్రాలను లలిత్ కలవడంపై స్పందిస్తూ.. ‘అనుకోకుండా రెస్టారెంట్లో ఎదురుపడడమేమన్నా నేరమా?’ అని ప్రశ్నించారు. రాజస్తాన్‌లో కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి అవగాహన ఒప్పందంలో ‘క్విడ్ ప్రొ కో’ ఉందన్నారు. ‘లలిత్‌తో ప్రియాంక మర్యాదపూర్వకంగా కూడా ఏనాడూ సమావేశం కాలేద’ని ప్రియాంక కార్యాలయం పేర్కొంది. -
మాలో కళంకితులెవరూ లేరు!
వసుంధర రాజేకు బాసటగా నిలవాలని బీజేపీ నిర్ణయం! * రాజే సంతకం ఉన్న డాక్యుమెంట్ ప్రామాణికతపై బీజేపీ అనుమానం * ముఖ్యమంత్రి రాజీనామా వార్తలు అసత్యమన్న రాజస్తాన్ సీఎంఓ న్యూఢిల్లీ: లలిత్ మోదీ వ్యవహారంలో రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు బాసటగా నిలవాలని, ఆమె రాజీనామా చేయాలన్న ప్రతిపక్ష కాంగ్రెస్ ఒత్తిడికి తలొగ్గకూడదని కేంద్రం, బీజేపీ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. వసుంధర రాజే సంతకంతో పాటు బయటపడిన లలిత్‌మోదీ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్‌పైనా బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. ఆమె సంతకం ఉన్న ఆ డాక్యుమెంట్లో ఉన్న సమాచారమేంటో కచ్చితంగా తెలియదని పేర్కొంది. ‘రాజె విషయంలో అక్రమం జరిగింది ఎక్కడ? ఆ డాక్యుమెంట్ ప్రామాణికతను నిర్ధారించాల్సి ఉంది. ఆమె(రాజె) ఏదైనా కోర్టు ముందు కానీ, జడ్జి ముందు కానీ సాక్ష్యం ఇచ్చారా? బ్రిటన్ ప్రభుత్వం ఈ విషయంపై ఏమైనా ప్రకటన చేసిందా?’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా గురువారం ప్రశ్నించారు. ‘మా వద్ద కళంకితులెవరూ లేరంటూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత నిజాయితీతో, పారదర్శకంగా పాలన సాగిస్తోందని మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి వసుంధర రాజే రాజీనామా వార్తలను రాజస్తాన్ ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. రాజేను రాజీనామా చేయమని పై నుంచి ఆదేశాలు వచ్చాయన్న వార్తలు అసత్యమని స్పష్టం చేసింది. స్థానిక వార్తాచానళ్లు రాజే ఇమేజ్ను దెబ్బతీసే లక్ష్యంతో అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయని గురువారం విడుదల చేసిన రెండు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొంది. తనపై ఎలాంటి చర్య తీసుకోకుండా పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ఎమ్మెల్యేలతో రాజే సమావేశం ఏర్పాటు చేశారన్నది అలాంటి అసత్య కథనమేనని తెలిపింది. కాగా, లలిత్ మోదీ ఇమిగ్రేషన్ దరఖాస్తును సమర్ధిస్తూ తాను సంతకం చేసిన విషయం వాస్తవమేనని పార్టీ నాయకత్వానికి వసుంధర రాజే తెలిపినట్లు సమాచారం. ఈ విషయంపై ఆమె వివరణ ఇచ్చారని పార్టీ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఇదిలా ఉండగా, నాటి బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, వసుంధర రాజే, ప్రస్తుత హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ జూలై 20, 2011లో లండన్‌లోని ఒక హోటల్లో దిగిన ఫొటో తాజాగా తెరపైకి వచ్చింది. అప్పుడు బీజేపీకి విదేశాల్లో మద్దతు కూడగట్టేందుకు లండన్ వెళ్లిన బీజేపీ బృందంలో వసుంధర కూడా ఉన్నారు. అయితే, ఆమె ఆ బృందంతో పాటు భారత్ తిరిగిరాకుండా, లలిత్ మోదీకి సాయం చేసేందుకు మరికొన్ని రోజులు లండన్‌లోనే ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. విపక్ష అస్త్రాలు మరింత పదును లలిత్ మోదీ ఇమిగ్రేషన్ దరఖాస్తుకు సంబంధించి వసంధర రాజే సంతకం చేసినట్లుగా చెబుతున్న డాక్యుమెంట్ సైతం బయటపడటంతో విపక్ష కాంగ్రెస్ తన అస్త్రాలను మరింత పదునెక్కించింది. రాజే రాజీనామా చేయనట్లైతే.. రానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగనీయబోమని గురువారం మరోసారి హెచ్చరించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మహిళానేతలు సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, స్మృతి ఇరానీ, పంకజ ముండేలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, ఆప్ లు ఢిల్లీలో ధర్నా నిర్వహించాయి. సామాన్యులకో చట్టం, బీజేపీ నేతలకో చట్టం ఉండదని, రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. మన్మోహన్ మౌని అయితే.. మోదీ మహా మౌని: దిగ్విజయ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మౌన ప్రధాని అయితే, ప్రస్తుత ప్రధాని మోదీ మహా మౌని అని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘ప్రతీ చిన్న విషయానికి తక్షణమే ట్వీట్లు వదిలే మోదీ.. ఇంత సీరియస్ ఆరోపణలపై మౌనంఎందుకు పాటిస్తున్నారు?. ఆయన నల్లధనంపై మాట్లాడరు. పాక్, చైనాల దుందుడుకుతనంపై మాట్లాడరు. సున్నితమైన అంశాలపై ట్వీట్లు చేయరు. ఆయన ప్రభుత్వ విధానం యోగా. యోగా చేయండి. అన్నీ మర్చిపోండి అన్నట్లుగా ఉంది ఆయన తీరు’ అని ధ్వజమెత్తారు. -
మా వాళ్లు రాజీనామా చేయరు!
లలిత్ వ్యవహారంలో సుష్మ, రాజేలకు బీజేపీ బాసట * విపక్ష ఆరోపణలు హాస్యాస్పదమని వ్యాఖ్య న్యూఢిల్లీ: లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు మద్దతుగా ఇప్పటివరకు నోరువిప్పని బీజేపీ నాయకత్వం ఎట్టకేలకు మౌనం వీడింది. వసుంధర రాజే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని శుక్రవారం తేల్చి చెప్పింది. విపక్ష అవినీతి ఆరోపణలను తిప్పికొడుతూ.. రాజే విషయంలో కానీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విషయంలో కానీ అవినీతి, అక్రమాలేవీ చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. మరోవైపు, విపక్ష కాంగ్రెస్ పట్టు వీడటం లేదు. ఆ ఇద్దరు నేతలు రాజీనామా చేయడమో, లేక వారిద్దరిని పదవుల నుంచి తొలగించడమో చేయకపోతే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడ్డుకుని తీరుతామని హెచ్చరించింది. లలిత్ మోదీతో ప్రధాని మోదీకి కూడా సంబంధాలున్నాయంటూ ఆరోపించింది. బాసటగా నిలిచేందుకే నిర్ణయం మనీ లాండరింగ్ సహా తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ, లండన్ పరారైన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విషయంలో వసుంధర రాజే సహకరించారన్న వార్తలు వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం లేచిన విషయం తెలిసిందే. ఈ అంశం తీవ్రమై.. ప్రభుత్వ, పార్టీ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి రావడంతో ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. మొదట కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని మోదీ.. ఆ తరువాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ సుదీర్ఘ మంతనాలు జరిపారు. అనంతరం విపక్ష డిమాండ్లకు తలొగ్గకూడదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దాంతో సీనియర్ నేతలు సుష్మ, రాజేలకు పార్టీ తరఫున మద్దతు ప్రకటించే బాధ్యతను అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదీకి అప్పగించారు. ఆయన శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆ ఇద్దరు సీనియర్ నేతలకు పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు. విపక్ష ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. పార్టీ అగ్ర నాయకత్వానికి రాజే వివరణ ఇచ్చారన్నారు. కాగా, పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ పర్యటనను శుక్రవారం వసుంధర రాజే రద్దు చేసుకున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్‌కు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షాలు కూడా వెళ్తున్న నేపథ్యంలో.. వారిని ముఖాముఖి కలవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆమె తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ‘యోగా డే తరువాతైనా చర్య తీసుకోండి’ ‘‘యోగా డే తరువాతైనా, ‘లలితాసన్’ తరువాతైనా ఈ విషయంలో ప్రధాని కఠిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామ’ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యంగ్యంగా అన్నారు. పార్లమెంట్ వర్షాకాల భేటీలు సజావుగా సాగాలంటే.. సుష్మ, రాజేలు రాజీనామా చేయడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదన్నారు. లలిత్‌కు ఇద్దరు పార్టీ సీనియర్ నేతలు సహకారం అందించే విషయం ప్రధానికి తెలుసని మరో నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు.