బీజేపీపై తీవ్ర వ్యతిరేకత | Rahul Gandhi To Be Oppositions PM Face For 2024 | Sakshi
Sakshi News home page

బీజేపీపై తీవ్ర వ్యతిరేకత

Published Sun, Jan 1 2023 4:36 AM | Last Updated on Sun, Jan 1 2023 5:38 AM

Rahul Gandhi To Be Oppositions PM Face For 2024 - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఒకే లక్ష్యంతో ఏకతాటిపై నిలబడితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి చాలా కష్టమవుతుందని జోస్యం చెప్పారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని జోడో యాత్రలో తెలుసుకున్నానన్నారు. ‘‘గతంలోలా వ్యూహాత్మక రాజకీయ పోరాటం ద్వారా, కొన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించడం అసాధ్యం. దేశమంతా ఒకే భావజాలం చేతుల్లో ఉంది. అదే దేశ రాజకీయాలపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. దాన్ని ఓడించేందుకు మరో భావజాలం కావాలి. ప్రజలకు ప్రత్యామ్నాయ జాతీయ విధానాన్ని చూపాలి. కాంగ్రెస్‌కు మినహా మిగతా ప్రాంతీయ పార్టీలకు అలాంటి విధానమేదీ లేదు’’ అన్నారు.

బీజేపీయే గురువు!
ఎప్పటికప్పుడు ఏం చేయకూడదో చెప్పే బీజేపీని గురువుగా భావిస్తానని రాహుల్‌ అన్నారు. కాంగ్రెస్‌పై బీజేపీ ఎంతగా దాడి చేస్తే దాని భావజాలాన్ని అంతగా అర్థం చేసుకుని ఎదురొడ్డి నిలుస్తుందన్నారు. ‘‘ప్రజలందరినీ ఏకం చేసేలా భారత్‌ జోడో యాత్రకు కాంగ్రెస్‌ రూపకల్పన చేసింది. విపక్షాలు రాజకీయ తదితర కారణాలతో యాత్రలో పాల్గొనకున్నా అవన్నీ యాత్రకు తోడుగా ఉన్నాయి. దూరంగా ఉండిపోతున్నట్లు వివరించారు. యాత్రలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికీ తలుపులు తెరిచి ఉంటాయన్నారు.

కేంద్రం ఆరోపణలపై ధ్వజం
ఢిల్లీలో జోడో యాత్ర సమయంలో సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించారన్న కేంద్రం ఆరోపణలను రాహుల్‌ తోసిపుచ్చారు. ‘‘ఇది ప్రజలతో మమేకమవుతూ చేసే పాదయాత్ర. బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లలో చేయడం అసాధ్యం. బీజేపీ నేతలు బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లలో తిరుగుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా చర్యలే లేవు. ప్రొటోకాల్స్‌ ఒక్కో పార్టీకి ఒక్కోలా ఉంటున్నాయి’’ అని ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement