‘సీఎం పదవికి ముందు రాజీనామా చేయండి’
ఇంపాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రామ్ ఇబోబీ సింగ్‌ను రాజీనామా చేయాల్సింది ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మాహెప్తుల్లా కోరారు. రాజీనామా చేస్తే తదుపరి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న ఆయన డిమాండ్‌ను గవర్నర్ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల మొత్తం 60 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 స్థానాలు, మిగితా సీట్లు ఇతర పార్టీలు, స్వతంత్ర్య అభ్యర్థులు గెలుచుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే 31 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.
ఈ ప్రకారం కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా మేజిక్ ఫిగర్ మాత్రం అందుకోలేకపోయింది. ఇతర పార్టీలవారు బీజేపీకి మద్దతిస్తామని చెబుతున్నారు. అయితే, గత రాత్రి ఇబోబీతోపాటు డిప్యూటీ సీఎం గైఖాంగమ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్ హావోకిప్ గవర్నర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో వెంటనే రాజీనామా చేయాలని ఇబోబీకి గవర్నర్ హెజ్మా సూచించారు. అయితే, తమ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చాయని, 28 సీట్లు గెలుచుకున్న తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇబోబీ కోరారు.
దాంతోపాటు నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని ఖాళీ పేపర్లో రాసుకొని వచ్చి చూపించారు. అయితే, కాగితంపై రాసివ్వడం కాకుండా ఆ పార్టీ అధ్యక్షుడిని, గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి చూపించాలని కోరారు. బీజేపీ 21మంది గెలిచిన అభ్యర్థులతోపాటు ఎన్‌పీపీ అధ్యక్షుడిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలనుచ ఎల్జేపీ, టీఎంసీ ఎమ్మెల్యేను తీసుకొచ్చి తమకే అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఆమె గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇబోబిని రాజీనామా చేయాలని కోరినట్లు తెలుస్తోంది.