రాష్ట్రంలో తిరుగుబాటుదారులు హింసకు స్వస్తి పలకాలని మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబీసింగ్ గురువారం ఇంఫాల్లో వెల్లడించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి పథకాల్లో భాగస్వాములు కావాలని ఆయన తిరుబాటుదారులకు సూచించారు. తిరుబాటుదారులతో చర్చలకు ప్రభుత్వ తలుపులు ఎల్లప్పుడు తెరిచే ఉంటాయన్నారు. ప్రజాస్వామ్య సమాజంలో హింసకు తావుండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
67వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని రాష్ట్ర రాజధాని ఇంఫాల్ పేరెడ్ గ్రౌండ్లో ఓక్రాం ఇబోబీసింగ్ జెండా ఆవిష్కరణ చేసి, ప్రభుత్వ దళాలు అందించిన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు పేరెడ్ గ్రౌండ్లో సమీపంలోని మిరంగ్కొమ్ ప్రాంతంలోని పేట్రోల్ బంక్ వద్ద బాంబు పేలుడు సంభవించింది. అయితే ఆ ఘటనలో ఎవరు గాయపడలేదని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు వెల్లడించారు.
అలాగే రాష్టవ్యాప్తంగా ఆ ఒక్క సంఘటన మినహా మరెక్కడ ఎటువంటి ఘటన చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. అయితే ఇటీవలే ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబీసింగ్ నివాసం వద్ద బాంబుపేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే.