సీఎంగా మాజీ ఫుట్‌బాల్ ఆటగాడి ప్రమాణస్వీకారం
ఈశాన్య భారతంలోని మణిపూర్ రాష్ట్రానికి మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, మాజీ పాత్రికేయుడు నాంగ్ తొంబం బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. హైన్‌గాంగ్ నియోజకవర్గం నుంచి మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికైన బీరేన్.. తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
వాస్తవానికి 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే కనీసం 31 మంది మద్దతు అవసరం. అయితే బీజేపీకి 21 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ, దాదాపు కాంగ్రెసేతర ఎమ్మెల్యేలందరూ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. పార్టీ జాతీయ నేతలు రామ్ మాధవ్, హిమంత బిశ్వ శర్మ ఈ దిశగా చక్రం తిప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏదైనా దానికి మద్దతిస్తామని నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) ముందే చెప్పింది. అలాగే కాన్రాడ్ సంగ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ కూడా ముందుకొచ్చింది. ఇక ఎల్‌జేపీ, టీఎంసీ కూడా మద్దతు పలికాయి. దాంతో బీజేపీ నాయకులు గవర్నర్ వద్దకు వెళ్లి తమ బలాన్ని చూపించారు. అయితే.. అలా వెళ్లే బృందంలో హిమంత బిశ్వ శర్మ కారులో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు. తానే కాదని, ఇంకా చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వస్తారని ఆయన చెప్పారు.