Manipur Chief Minister
-
సీఎంగా మాజీ ఫుట్‌బాల్ ఆటగాడి ప్రమాణస్వీకారం
ఈశాన్య భారతంలోని మణిపూర్ రాష్ట్రానికి మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, మాజీ పాత్రికేయుడు నాంగ్ తొంబం బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. హైన్‌గాంగ్ నియోజకవర్గం నుంచి మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికైన బీరేన్.. తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. వాస్తవానికి 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే కనీసం 31 మంది మద్దతు అవసరం. అయితే బీజేపీకి 21 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ, దాదాపు కాంగ్రెసేతర ఎమ్మెల్యేలందరూ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. పార్టీ జాతీయ నేతలు రామ్ మాధవ్, హిమంత బిశ్వ శర్మ ఈ దిశగా చక్రం తిప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏదైనా దానికి మద్దతిస్తామని నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ముందే చెప్పింది. అలాగే కాన్రాడ్ సంగ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ కూడా ముందుకొచ్చింది. ఇక ఎల్జేపీ, టీఎంసీ కూడా మద్దతు పలికాయి. దాంతో బీజేపీ నాయకులు గవర్నర్ వద్దకు వెళ్లి తమ బలాన్ని చూపించారు. అయితే.. అలా వెళ్లే బృందంలో హిమంత బిశ్వ శర్మ కారులో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు. తానే కాదని, ఇంకా చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వస్తారని ఆయన చెప్పారు. -
రాజీనామాపై సీఎం భిన్న ప్రకటనలు
ఇంఫాల్: మణిపూర్ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. 60 సీట్లున్న మణిపూర్‌లో అధికార కాంగ్రెస్ 28 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతోంది. 21 సీట్లు గెలిచిన బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేల (11) మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. సోమవారం మణిపూర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మా హెప్తుల్లా సూచించగా.. కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి తిరస్కరించారు. తనకు మెజార్టీ ఉందని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. కాగా ఇబోబి కొన్ని నిమిషాల్లోనే దిగొచ్చారు. 24 గంటల్లో రాజీనామా చేస్తానని తర్వాత ప్రకటించారు. మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 ఎమ్మెల్యేలు ఉండాలి. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చారని, మొత్తం 32 ఎమ్మెల్యేలు ఉన్నారని, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని బీజేపీ నేతలు గవర్నర్‌ను కలసి కోరారు. 32 ఎమ్మెల్యేలను కూడా గవర్నర్ దగ్గరకు తీసుకెళ్లారు. కాగా ముఖ్యమంత్రి ఇబోబి కూడా గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా.. ఆమె తిరస్కరించారు. బీజేపీకి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున సీఎం పదవికి రాజీనామా చేయాలని ఇబోబికి సూచించారు. రాజీనామా చేయడానికి మొదట తిరస్కరించిన ఇబోబి.. అంతలోనే మనసు మార్చుకుని మంగళవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు. -
మణిపూర్ సీఎం నివాసం సమీపంలో బాంబు పేలుడు
మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ అధికార నివాసానికి కూతవేటు దూరంలో మంగళవారం ఉదయం 6 గంటలకు శక్తివంతమైన బాంబు పేలింది. ఆ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని సీఎం నివాసానికి అత్యంత సమీపంలోని కవైర్రాంబండ మార్కెట్ కాంప్లెక్ సమీపంలోని బిరొడన్ స్కూల్ వద్ద ఆ బాంబు విస్ఫోటం సంభవించింది. సీఎం నివాసం సమీపంలో బాంబు పేలుడుతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అడుగడుగున తనిఖీలు చేపట్టారు. అయితే తీవ్రవాదులు ఆ బాంబును అమర్చార లేక విసిరార అనేది ఇంకా తెలియలేదని పోలీసులు వెల్లడించారు. అలాగే ఆ బాంబు పేలుడుకు తామే బాధ్యుల మంటూ ఇంతవరకు ఎవరు ప్రకటించలేదు. గత ఆగస్టులో కూడా సీఎం ఓక్రమ్ ఇబోబి సింగ్ ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఆయన నివాస ప్రాంగణం ఎదుట బాంబు పేలిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనలో కూడా ఎవరు గాయపడలేదు. -
తిరుబాటుదారులు జనజీవన స్రవంతిలో కలవండి
రాష్ట్రంలో తిరుగుబాటుదారులు హింసకు స్వస్తి పలకాలని మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబీసింగ్ గురువారం ఇంఫాల్‌లో వెల్లడించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి పథకాల్లో భాగస్వాములు కావాలని ఆయన తిరుబాటుదారులకు సూచించారు. తిరుబాటుదారులతో చర్చలకు ప్రభుత్వ తలుపులు ఎల్లప్పుడు తెరిచే ఉంటాయన్నారు. ప్రజాస్వామ్య సమాజంలో హింసకు తావుండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. 67వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని రాష్ట్ర రాజధాని ఇంఫాల్ పేరెడ్ గ్రౌండ్లో ఓక్రాం ఇబోబీసింగ్ జెండా ఆవిష్కరణ చేసి, ప్రభుత్వ దళాలు అందించిన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు పేరెడ్ గ్రౌండ్లో సమీపంలోని మిరంగ్కొమ్ ప్రాంతంలోని పేట్రోల్ బంక్ వద్ద బాంబు పేలుడు సంభవించింది. అయితే ఆ ఘటనలో ఎవరు గాయపడలేదని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే రాష్టవ్యాప్తంగా ఆ ఒక్క సంఘటన మినహా మరెక్కడ ఎటువంటి ఘటన చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. అయితే ఇటీవలే ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబీసింగ్ నివాసం వద్ద బాంబుపేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే.