రాజీనామాపై సీఎం భిన్న ప్రకటనలు
ఇంఫాల్: మణిపూర్ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. 60 సీట్లున్న మణిపూర్‌లో అధికార కాంగ్రెస్ 28 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతోంది. 21 సీట్లు గెలిచిన బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేల (11) మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. సోమవారం మణిపూర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మా హెప్తుల్లా సూచించగా.. కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి తిరస్కరించారు. తనకు మెజార్టీ ఉందని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. కాగా ఇబోబి కొన్ని నిమిషాల్లోనే దిగొచ్చారు. 24 గంటల్లో రాజీనామా చేస్తానని తర్వాత ప్రకటించారు.
మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 ఎమ్మెల్యేలు ఉండాలి. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చారని, మొత్తం 32 ఎమ్మెల్యేలు ఉన్నారని, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని బీజేపీ నేతలు గవర్నర్‌ను కలసి కోరారు. 32 ఎమ్మెల్యేలను కూడా గవర్నర్ దగ్గరకు తీసుకెళ్లారు. కాగా ముఖ్యమంత్రి ఇబోబి కూడా గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా.. ఆమె తిరస్కరించారు. బీజేపీకి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున సీఎం పదవికి రాజీనామా చేయాలని ఇబోబికి సూచించారు. రాజీనామా చేయడానికి మొదట తిరస్కరించిన ఇబోబి.. అంతలోనే మనసు మార్చుకుని మంగళవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు.