రేపు మణిపూర్ సీఎంగా బీరెన్ ప్రమాణం
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మంగళవారం సాయంత్రం ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మా హెప్తుల్లా.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. బీజేపీ శాసన సభ పక్ష నాయకుడు నాంగ్‌తోంబం బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. బుధవారం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మొత్తం 60 అసెంబ్లీ సీట్లున్న మణిపూర్‌లో కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీ రెండో పార్టీగా నిలిచినా.. నలుగురేసి ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్)తో పాటు ఒక లోక్ జనశక్తి ఎమ్మెల్యే, ఒక తృణమూల్ ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతిస్తున్నారు. దీంతో బీజేపీ బలం 32కు పెరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు తనకే అవకాశం ఇవ్వాలంటూ రాజీనామా చేసేందుకు తాజా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్ నిరాకరించినా.. హైడ్రామా నడుమ సోమవారం రాత్రి సీఎం పదవికి రాజీనామా చేసి, లేఖను గవర్నర్‌కు అందజేశారు. దీంతో బీజేపీకి లైన్ క్లియరైంది.