మిమ్మల్ని సంప్రదించాకే తుది ఒప్పందం
మణిపూర్, నాగా సీఎంలకు ప్రధాని హామీ
న్యూఢిల్లీ: నాగా గ్రూపులతో కేంద్రం తుది ఒప్పందం చేసుకునే ముందు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులను తప్పకుండా సంప్రదిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. గత వారం ఎన్‌ఎస్‌సీఎన్(ఐఎం)తో కేంద్రం చేసుకున్న శాంతి ఒప్పందం వివాదాస్పదం అయిన నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్, నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జీలియాంగ్ ప్రధాని మోదీని విడివిడిగా కలసి ఒప్పందం గురించి చర్చించారు. తుది ఒప్పందం చేసుకునే ముందు ఏడు ఈశాన్యరాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చినట్లు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
నాగా ఒప్పందం చేసుకునే ముందు ఈశాన్యరాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం సంప్రదించకపోవటం దారుణమంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రధాని ఈ హామీ ఇచ్చారు. నాగాలాండ్ ముఖ్యమంత్రి ఎన్డీఏ మిత్రపక్షమైన నాగాలాండ్ పీపుల్స్‌ఫ్రంట్ నేత కాగా, మణిపూర్‌లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మణిపూర్ ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కూడా కలసి ఒప్పందం కాపీ కావాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే అది తుది ఒప్పందం కాదని.. అందుకు సంబంధించిన ప్రాథమిక మార్గదర్శకాలు మాత్రమేనని రాజ్‌నాథ్ చెప్పారు. కాగా, నాగాతో శాంతి ఒప్పందం చేసుకోవటం ఇతర ఈశాన్యరాష్ట్రాలను నిర్లక్ష్యం చేసినట్లు కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు గువాహటిలో స్పష్టంచేశారు. అటు బీజేపీ కూడా ఈ ఒప్పందాన్ని కాంగ్రెస్ వివాదం చేయటంపై మండిపడింది.