వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం
కాటారం : పోడుభూమికి ప్రభుత్వం పట్టా ఇచ్చినా అటవీశాఖ అధికారులు వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం మల్హర్ మండలంలో జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. మండలంలోని ఎడ్లపల్లి పరిధి జంగిలిపల్లికి చెందిన భూక్య రాజుకు ఏడో విడత భూ పంపిణీలో ప్రభుత్వం నాలుగెకరాల పోడు భూమికి పట్టా ఇచ్చింది. రాజు ఆ భూమిలో పంటలు సాగు చేస్తున్నాడు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన హరితహారంలో భాగంగా రాజు భూమిలో అటవీఅధికారులు మొక్కలు నాటారు. ప్రశ్నిస్తే.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు బెదిరింపులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న భూమికి అధికారులు అడ్డు తగులుతుండటంతో రాజు మనస్తాపానికి గురై అటవీశాఖ అధికారుల ఎదుటే క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన సిబ్బంది రాజును చికిత్స నిమిత్తం మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. రాజు పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలిసింది.