అక్కడ గురి తప్పి... ఇక్కడ పేలిందా!
చెన్నై : ఉద్యాననగరిపై ఉగ్రవాదుల గురి తప్పి.. చెన్నైని టార్గెట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం జరిగిన జంట పేలుళ్లు ఘటన దానికి బలం చేకూర్చేలా ఉంది. బెంగళూరు నుంచి చెన్నై వచ్చిన గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఉదయం పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. కర్ణాటక విధాన సౌధను పేల్చడానికి కుట్రపన్నిన ఐఎస్ఐ ఉగ్రవాదిని తమిళనాడు పోలీసులు రెండు రోజుల క్రితమే అరెస్ట్ చేశారు.
కేంద్ర నిఘావర్గాల సమాచారం మేరకు జాహీర్ హుసేన్ అనే ఉగ్రవాదిని మంగళవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో బెంగళూరులోని విధాన సౌధతో పాటు మరికొన్ని ఐటీ కంపెనీల కేంద్ర కార్యాలయాలను బాంబులతో పేల్చివేయడానికి కుట్రపన్నినట్లు జాహీర్ హుసేన్ వెల్లడించాడని తెలుస్తోంది.
కాగా జాహీర్ హుసేన్ అరెస్ట్‌తో బెంగళూరులో ముప్పు కొంతవరకు తప్పినా.. ఉగ్రవాదులు గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్లకు కుట్ర పన్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతన్ని అరెస్ట్ చేసిన రెండోరోజే ఈ పేలుళ్లు జరగటం గమనార్హం. దీంతోపాటు ఇంకా ఎక్కడైనా పేలుళ్లకు పాల్పడే ప్రమాదముందేమోనని నిఘావర్గాలు అప్రమత్తం అయ్యాయి. అయితే పేలుళ్లతో తమకు సంబంధం ఉన్నట్లు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.