పండుగ రోజుల్లో ఢిల్లీపై ఐఎస్ఐఎస్ కన్ను?
దసరా, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి ఈ వివరాలు ప్రస్తుతం ఢిల్లీ స్పెషల్ సెల్‌కు వెళ్లాయి. వాళ్లు మొత్తం పరిస్థితిని గమనిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. 'లోన్ వుల్ఫ్' అనే బృందం లేదా ఒక వ్యక్తి ఢిల్లీలో దాడులు చేయొచ్చని ఉగ్రవాదుల సంభాషణలను రహస్యంగా సేకరించిన నిఘా వర్గాలు తెలిపాయి. సిమి సభ్యులు కూడా ఐఎస్ఐఎస్ కోసం పనిచేసే అవకాశం కూడా లేకపోలేదని, ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ దాడులకు పాల్పడొచ్చని చెబుతున్నారు.
సిమి ఎప్పుడూ చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి దాడులకు తెగబడుతుంటుంది. ఇదే తరహా వ్యూహాన్ని ఆ తర్వాత ఇండియన్ ముజాహిదీన్ కూడా అవలంబిస్తోంది. ఉగ్రవాదుల దాడులకు ఢిల్లీ సులభంగా టార్గెట్ కావొచ్చని చెబుతున్నారు. ప్రధానంగా ఏయూటీ అనే ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో కలిసిపోవడంతో ఈ ప్రమాదం పెరిగిందని అంటున్నారు.
2008లో జరిగిన బాట్లాహౌస్ ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదులను 'అమరవీరులు'గా పేర్కొంటూ ఏయూటీ సంస్థ గత సంవత్సరం సెప్టెంబర్‌లో సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. ఇటీవలి కాలంలో ఏయూటీ సంస్థకు, ఇస్లామిక్ స్టేట్‌కు మధ్య సంబంధాలు పెరుగుతున్నాయని, కొంతమంది యువకులు ఈ రెండు సంస్థలను సంప్రదించినట్లు కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని నిఘా వర్గానికి చెందిన ఓ అధికారి తెలిపారు. దీంతోపాటు లష్కరే తాయిబా, జైషే మహ్మద్ లాంటి సంస్థల నుంచి కూడా ఢిల్లీకి ముప్పు పొంచి ఉంది.