వారం, పది రోజుల్లో పాక్ ఆర్మీకి కొత్త చీఫ్!
ఇస్లామాబాద్: కేవలం వారం లేదా పది రోజుల్లోనే పాకిస్తాన్ ఆర్మీకి కొత్త చీఫ్ ను నియమించనున్నట్లు ఆ దేశ సీనియర్ మంత్రి తారీఖ్ ఫజల్ చౌదరీ తెలిపారు. ప్రస్తుతం పాక్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ రహీల్ షరీఫ్ పదవీ కాలం ఈ నెల చివర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీకి కొత్త చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందా అన్న దానిపై అక్కడ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పాక్ ప్రభుత్వం ఇప్పటివరకైతే ఆ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదని కానీ అతి త్వరలోనే పేరు వెల్లడిస్తామని అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్ మీడియాకు చెప్పారు.
తనకంటే ముందు ఆ బాధ్యతలు చేపట్టిన జనరల్ అష్ఫఖ్ పర్వేజ్ కయానీ తరహాలో రెండో పర్యాయం కొనసాగే ఉద్దేశం తనకు లేదని ప్రస్తుత ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ కొన్ని నెలల కిందటే వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పాక్ ఆర్మీకి 15వ చీఫ్ గా ఉన్నారు. 2013 నవంబర్ 29న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మూడేళ్ల కాలానికి ఆర్మీచీఫ్‌గా రహీల్ షరీఫ్‌ను నియమించిన విషయం తెలిసిందే.
భారత్ తో సంబంధాలు మెరుగ్గా లేకపోవడం, దేశంలోనూ ఎన్నో అంతర్గత సమస్యలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఆర్మీ చీఫ్ పదవీకాలం ముగిసిపోతే కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించే అధికారం కేవలం పాక్ ప్రధానికి మాత్రమే ఉంటుంది. దీంతో నమ్మకస్తుడయిన ఓ సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ కు పాక్ ఆర్మీ నూతన చీఫ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పాక్ మీడియా తెలిపింది.