కలర్‌ఫుల్ కుచ్చులు..
ఇప్పటివరకు ఎన్నో రకాల జ్యుయెలరీ మేకింగ్స్ను చూశాం. కానీ టాసెల్ జ్యుయెలరీని చూశారా? అదేనండీ దారాల కుచ్చు.. మీ డ్రెస్ కలర్‌కు మ్యాచ్ అయ్యే దారంతో సులువుగా జ్యుయెలరీ తయారు చేసుకోవచ్చు. రోజూ వేసుకునే జ్యుయెలరీనే కొత్తగా మార్చుకోవాలనుకుంటే.. రెండు మూడు కుచ్చులను వాటికి తగిలిస్తే సరి. ఈ జ్యుయెలరీ మేకింగ్‌కు ఒక్క టాసెల్స్ తయారీ తెలిస్తే చాలు.
కావలసినవి: రంగురంగుల దారాలు, కత్తెర
కుచ్చుల తయారీ: ముందుగా ఏ రంగు జ్యుయెలరీ కావాలనుకుంటే ఆ రంగు దారాన్ని తీసుకోండి. దాన్ని కావలసినంత పొడవులో 25-30 సార్లు చుట్టండి. ఇప్పుడు సరిగ్గా దాని మధ్యలో ఓ చిన్న దారంతో ముడి వేయాలి. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా మధ్యభాగంలోని సన్న దారాన్ని పట్టుకొని, ఇరువైపుల దారాలను మరోదారంతో ముడివేయాలి.
ఆపైన చివర్లను కత్తెరతో కట్ చేస్తూ సమానంగా చేసుకోవాలి. అంతే అందమైన కలర్‌ఫుల్ కుచ్చు రెడీ. ఇప్పుడు ఈ కుచ్చుతో ఫొటోలోని జ్యుయెలరీని ఎంతో అందంగా.. ఈజీగా చేసుకోవచ్చు. చెయిన్స్‌కు, బ్రేస్‌లెట్స్‌కు లాకెట్లలా మార్చి, డ్రెస్‌కు మ్యాచ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇయర్రింగ్స్ కావాలంటే.. ఈ కుచ్చుకు ఒక హుక్ లేదా రింగ్ తగిలిస్తే చాలు. అలాగే కాళ్ల పట్టీలను కూడా రంగురంగుల కుచ్చులతో అలంకరించొచ్చు.