ఆశ.. దోసె.. అప్పడం.. వడ...
హిట్ క్యారెక్టర్
చిత్రం : టాటా-బిర్లా-మధ్యలో లైలా (2006)
డెరైక్ట్ చేసింది : శ్రీనివాస్‌రెడ్డి
సినిమా తీసింది : బెక్కెం వేణుగోపాల్ (గోపి)
మాటలు రాసింది : బ్రహ్మం
దర్శించండి! తరించండి! ఆదో అవ స్వామివారు నగరమునకు వేంచేసియున్నారు. ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకూ భక్తులకు తన దివ్య హస్తములతో ఆశీస్సులు అందజేస్తారు. నగరం నడిబొడ్డున ఆదో అవ స్వామి పేరుతో పెద్ద పెద్ద బేనర్లు వెలిశాయి. ఆదో అవ స్వామిని చూడడం కోసం జనాలు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు.
కొత్త ఎప్పుడూ వింతే కదా! స్వామీజీలు ఎంత మందొచ్చినా భక్తులు తమ విశాల హృదయంలో వాళ్లకు టపీమని చోటిచ్చేస్తారు. ఆదో అవ స్వామి విషయంలోనూ అంతే. ఆదో అవ స్వామి అంటే... ఆశ.. దోసె.. అప్పడం.. వడ... స్వామి అని అర్థం. ఆదో అవ స్వామివారు సుఖాసనంలో కూర్చుని ధ్యానముద్రలో ఉన్నారు. భక్తులంతా ఆయన దివ్యారవిందాన్ని కనులారా వీక్షిస్తూ... ఎప్పుడెప్పుడు కళ్లు తెరుస్తారా, తమపై వరాల జల్లు కురిపిస్తారా అని చూస్తున్నారు. కాసేపటికి స్వామి కళ్లు తెరిచి ‘జై తుస్’ అన్నాడు.భక్తులంతా పరమానందభరితులైపోయారు.
స్వామివారు అనుగ్రహ భాషణం చేయడం మొదలుపెట్టారు. ‘‘మానవుడు ఆశాజీవి. అన్యాయాలూ అక్రమాలూ జరుగుతున్నది ఆ ఆశ వల్లనే. అయినా సరే ఆ ఆశలోనే బతుకుతున్నాడు... ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే - పొద్దున్నే పెరుగన్నం, ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు. కానీ మనం హోటల్‌కెళ్లి వేడివేడిగా దోసె తినాలనుకుంటాం. ఆశ. అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడివేడిగా నూనెలో వడలు వేస్తూ ఉంటారు. ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ. ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమైపోతుంది? ఏదో ఒక రోజు అప్పడంలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు. ఆశ దోసె అప్పడం వడ.’’ స్వామి వారి ప్రసంగం పూర్తి కాగానే భక్తులు పులకించిపోయారు. ‘ఆశ.. దోసె.. అప్పడం.. వడ’ అంటూ స్వామివారు రాగయుక్తంగా పాడటం మొదలుపెట్టారు. భక్తులు కూడా ఆ రాగంలో రాగం కలిపారు.
ఓ భక్తుడు స్వామివారి ముందు మోకరిల్లి ‘‘ఈమధ్య నాకేమీ కలిసి రావడం లేదు. కొంచెం నా జాతకం చూసి దారి చూపించండి స్వామి’’ అంటూ తన జాతకాన్ని అందించాడు. స్వామి జాతకాన్ని అటూ ఇటూ తిరగేశాడు. ‘‘మీ నాన్న పేరు పెంటయ్య. వయసు 60 సంవత్సరాలు’’ అని స్వామి చెప్పగానే, ఈ భక్తుడు షాక్.‘‘మీ అమ్మ పేరు సుబ్బమ్మ. వయసు 58 సంవత్సరాలు’’ అనగానే, భక్తుడు డబుల్ షాక్. ‘‘నీకు ముగ్గురు పిల్లలు’’... భక్తుడు త్రిబుల్ షాక్. ‘‘ఈ నెల ఐదో తారీఖున 10 కిలోల బియ్యం, ఐదు కిలోల పంచదార, రెండు లీటర్ల కిరోసిన్ తీసుకున్నావ్’’ అని స్వామి చెబుతుంటే, ఆ భక్తుడు పులకించిపోతూ ‘‘ఆహా... స్వామీ ఎలా చెప్పారు?’’ అనడిగాడు.‘‘రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా ఎదవ సన్నాసి. నీ కళ్లకెలా కనిపిస్తున్నానురా పాపీ!’’ అని ఆ రేషన్ కార్డును విసిరి కొట్టాడు. అతగాడు క్షమించమన్నాడు. దూరంగా నిలబడ్డ ఇద్దరిని స్వామి చూశాడు.‘‘నాయనా! తాడి తాతరాజు... అలియాస్ టాటా. బొద్దూరి రామలింగం అలియాస్ బిర్లా. రండి నాయనలారా!’’ అని పిలిచేసరికి వాళ్లిద్దరూ ఉబ్బితబ్బిబైపోయారు.
‘‘స్వామీ! మా పూర్తి పేర్లు ఎలా తెలిశాయ్?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు బిర్లా. ‘‘మీ పేర్లే కాదు నాయనా... మీ జాతకాలు కూడా తెలుసు’’ అనేసరికి ఆ ఇద్దరూ కంగారుపడిపోయారు. బిర్లా వెంటనే తేరుకుని ‘‘జాతకాలొద్దులేండి... లైలాతో నా ప్రేమ ఫలిస్తుందో లేదో చెప్పండి’’ అనడిగాడు. దానికి స్వామి చిద్విలాసంతో ‘‘దేవదాసు ప్రేమలో న్యాయముంది. మజ్నూ ప్రేమలో అర్థముంది. నీ ప్రేమలో ఏముంది నా తుస్సు. అయినా నువ్వొక దొంగవి...’’ అనగానే, బిర్లా బిక్కమొహం పెట్టాడు. స్వామి కొంచెం గ్యాప్ ఇచ్చి ‘‘నువ్వు ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు పగలగొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్వు ఒంటపట్టదు నాయనా’’ అని చెబుతూ, తన కమండలంలో ఉన్న తీర్థాన్ని నోట్లో పోసుకున్నాడు. టాటా ఆ కమండలం వంక అనుమానంగా చూస్తూ ‘‘ఇదేంటి? తీర్థం... బ్రాందీ వాసనొస్తోంది?’’ అన్నాడు.
వెంటనే స్వామి ఉలిక్కిపడి మళ్లీ తేరుకున్నాడు. ‘‘అర్భకుడా! మొన్న మేం హిమాలయాలకు వెళ్లి తెచ్చిన క్వార్టర్ వాటర్ అది.... వెళ్లండి’’ అని వాళ్లిద్దర్నీ అక్కడ నుంచీ తొందరగా పంపించేశాడు స్వామి.
టాటా, బిర్లా పార్కులో షికారుకెళ్లి కారు దగ్గరకొచ్చారు. హడావిడిలో కారు లాక్ చేయలేదు. కారు డోర్ తీసి చూస్తే... లోపల ఆదో అవ స్వామి. వీళ్లిద్దరూ దణ్ణాలు పెట్టేశారు. కానీ స్వామి కంగారులో ఉన్నాడు. ‘‘ఒరేయ్! నేను రా దొరబాబుని!’’ అంటూ మీసాలూ గడ్డాలూ తీసి పారేశాడు. టాటా, బిర్లా కళ్లు విప్పార్చి మరీ చూశారు. నిజంగానే దొరబాబే. తమ ఊరివాడే. ‘‘ఏంట్రా ఈ వేషం?’’ అడిగాడు బిర్లా. ‘‘మన బ్యాచ్‌లో అందరూ పాలిటిక్స్‌లోనూ, రియల్ ఎస్టేట్‌లోనూ సెటిలైపోయారు.
నాకవి సరిపోక ఇందులో సెటిలయ్యా’’ చెప్పాడు దొరబాబు ఉరఫ్ ఆదో అవ స్వామి.‘‘ఈ ప్రొఫెషన్ బానే ఉందిగా... మరెందుకు ఇక్కడ దాక్కున్నావ్?’’ టాటా క్వశ్చన్ చేశాడు. ‘‘నా భక్తురాళ్లలో ఒకరికి కడుపైంది. అందరికీ నేనని తెలిసిపోయింది. కొట్టడానికి వస్తే ఇలా దాక్కున్నా’’ అంటూ దొరబాబు అసలు సీక్రెట్ చెప్పేశాడు. ‘‘ఓర్నీ... ఎంత పని చేశావురా. ఇప్పుడు నీ పరిస్థితేంటి?’’ ఆందోళనగా అడిగాడు టాటా.
‘‘ఇప్పటివరకూ అందరి భవిష్యత్తులూ నేను చెప్పాను. ఇప్పుడు నా భవిష్యత్తు మీ ఇద్దరి చేతుల్లో ఉంది’’ అంటూ వాళ్లను వాటేసుకుని బోరుమన్నాడు దొరబాబు. టాటాకో ఐడియా వచ్చింది. ‘‘మా ఇంటి ఓనర్ నీకు పరమ భక్తురాలు. అక్కడ తిష్ఠవేద్దువు గానీ’’ అన్నాడు.
దొరబాబు మొహం వెలిగిపోయింది. ‘‘మీ ఓనర్ యంగేనా?’’ అనడిగాడు. టాటా, బిర్లా ‘‘బొంగేం కాదు’’ అంటూ దొరబాబు జబ్బ మీద ఒక్కటిచ్చారు.
ఆదో అవ స్వామికి ఆ ఇంట్లో వాళ్లంతా ఫ్లాట్. ఒకటే పూజలూ పునస్కారాలు.పెద్దాయన పద్మనాభం ఓ ధర్మసందేహం వెలిబుచ్చాడు. ‘‘స్వామీ! చెట్టు ముందా? విత్తు ముందా?’’ మామూలుగా ఇంకెవరైనా అయితే కంగారుపడేవారు. దొరబాబు ముదురు టెంక కదా! అతని దగ్గర ఆన్సర్ రెడీగా ఉంది. ‘‘కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఏం చెప్పగలం. అంతా ఆ సర్వేశ్వరుడి లీల’’ అని చెప్పాడు. ‘‘స్వామీ అజ్ఞానులం. తెలుసుకోలేకపోతున్నాం. ఈ సృష్టి రహస్యం ఏమిటి?’’ అంటూ పద్మనాభం ఇంకో ధర్మ సందేహం. ‘‘ఏముంది పద్మనాభం... అంతా సర్వనామం’’ అని సింపుల్‌గా చెప్పేశాడు స్వామి.
‘‘ఆహా... ఎంత గొప్పగా సెలవిచ్చారు’’ అంటూ ‘ఆశ.. దోసె.. అప్పడం.. వడ...’ అని పాట అందుకున్నాడు పద్మనాభం. ఇలా ఆ ఇంట్లోఅందరికీ అద్భుతంగా పంగనామాలు పెట్టేశాడు ఆదో అవ స్వామి. సారీ దొరబాబు.టాటా, బిర్లాలకు దొరబాబు ట్యాలెంట్ అర్థమైపోయింది. వీడికి చీమ దూరే సందిస్తే ఏనుగునే పెట్టే స్తాడని!ఈ స్వామి రూపంలో ఉన్న దొరబాబు తన ప్రేమను సూపర్‌హిట్ చేస్తాడని బిర్లా బోలెడంత ఆశ పెట్టేసుకున్నాడు.
‘‘ఎలాగైనా నన్నూ, లైలానూ కలిపి పుణ్యం కట్టుకో’’ అని లైలాను తీసుకు రావడానికి వెళ్లాడు బిర్లా.ఈ గ్యాప్‌లో మన దొరబాబు, పళ్లు తీసుకొచ్చిన ఆ ఇంటి పనిమనిషికి లైనేసేయడం మొదలుపెట్టాడు. ‘‘బాలా! ఈ పనులు నీకేలా? ఏది నీ చెయ్యి ఇలా ఇవ్వు. నీ తలరాత మారుస్తా’’ అంటూ ఆమె అరచేతిని తన చేతితో రాస్తూ తెగ ఇదైపోతున్నాడు. ఈలోగా టాటా, బిర్లా, మధ్యలో లైలా ఎంటరయ్యారు. లైలాను చూడగానే స్వామి కళ్లల్లో ఏదో కలవరం. సేమ్ ఫీలింగ్ లైలాలో కూడా! ‘‘మా పెళ్లి ఎప్పుడు జరుగుద్ది’’ అడిగాడు బిర్లా.
‘‘జరగదు... ఈ జన్మలోనే కాదు. ఏ జన్మలోనూ జరగదు’’ అని చాలా కటువుగా చెప్పేశాడు దొరబాబు. ‘‘ఏం ఎందుకు జరగదు! నా లైలా మీద నువ్వు కన్నేశావా ఏంటి?’’ అంటూ బిర్లా ఆక్రోశించాడు. దొరబాబు అగ్గిమీద గుగ్గిలమైపోయాడు. ‘‘ఏంట్రా.. నీ ఎదవ టేస్టూ నువ్వూ.. ప్రేమించడానికి ఇంకెవరూ దొరకలేదా నీకు. పోయి పోయి మగాణ్ణి ప్రేమిస్తావా? అది లైలా కాదు. మస్తాన్. మన సీనియర్’’ అని దొరబాబు చెప్పగానే బిర్లాకు పాపం ఫ్యూజ్ కొట్టేసినట్టయిపోయింది. దొరబాబు ను పట్టుకుని కుయ్యో మొర్రోమని విలపించాడు బిర్లా.
‘‘అందుకేరా... ఆశ పడకూడదు. దోసెతో సరిపెట్టుకోక, వడ కోసం ఎగిరిపడ్డావ్. చివరకు నీ జీవితం అప్పడమైపోయింది’’ అంటూ హితబోధ చేశాడు దొరబాబు. ఆహా... ఎంత మంచి జీవిత సత్యం.క్వార్టర్తోనే ఫుల్ కిక్కిచ్చే జీవిత సత్యం. దీన్ని ఎవరు పాటిస్తే, వాళ్ల లైఫ్... జై తుస్!
కృష్ణ భగవాన్ సృష్టించిన పాత్ర ఇది
దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డికి కృష్ణభగవాన్, అలీ, నేను అంటే చాలా ఇష్టం. మేం ముగ్గురం లేకుండా అతను దాదాపుగా ఏ సినిమా తీయడు. ‘టాటా-బిర్లా-మధ్యలో లైలా’ సినిమాలో మొదట నాకు పాత్ర లేదు. కానీ ఎలాగైన నాకు పాత్ర క్రియేట్ చేయాలని శ్రీనివాస్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ఆ రోజు సిట్టింగ్స్‌లో రైటర్స్‌తో పాటు సరదాగా కృష్ణభగవాన్ కూడా కూర్చున్నాడట. తను ‘ఆశ.. దోసె.. అప్పడం.. వడ...’ అంటూ ఓ దొంగ స్వామీజీ కేరెక్టర్ గురించి చెప్పాడట.
హీరో శివాజీ, దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డిలకు ఆ పాత్ర బాగా నచ్చేసి, ఈ సినిమాలో వాడాలని డిసైడైపోయారు. అలా ఆ పాత్ర నాకొచ్చింది. ఈ పాత్ర కారణంగా గ్రామీణ ప్రేక్షకులకు కూడా నేను బాగా సుపరిచితం అయిపోయాను. రెండో తరగతి, మూడో తరగతి చదివే చిన్న చిన్న పిల్లలు కూడా నేను కనబడితే నాతో ఫొటో దిగాలని ఆసక్తి చూపిస్తుంటారు. నేనెవరో తెలుసా? అనడిగితే, ‘ఆశ.. దోసె.. అప్పడం.. వడ...’ అని చెబుతుంటారు. చానల్స్‌లో కామెడీ బిట్స్ ద్వారా వాళ్లకి అలా నేను గుర్తుండిపోయాను. ఏది ఏమైనా ఈ పాత్ర నా లైఫ్‌లో కీలకమైన మలుపు.
- రఘుబాబు