టాటా టెలికం భారత్ డేటా సెంటర్ విక్రయం!
♦ డీల్ విలువ రూ.3,150 కోట్లు
♦ సింగపూర్ టెక్నాలజీస్ చేతికి 74% వాటా
న్యూఢిల్లీ: టాటా కమ్యూనికేషన్స్ సంస్థ, తన భారత, సింగపూర్‌లకు చెందిన డేటా సెంటర్ వ్యాపారంలో 74% వాటాను విక్రయించింది. ఈ వాటాను ఎస్టీ (సింగపూర్ టెక్నాలజీస్ )టెలిమీడియాకు రూ.3,150 కోట్లకు విక్రయించామని టాటా కమ్యూనికేషన్స్ తెలిపింది. ఈ విక్రయానంతరం భారత్‌లో హైదరాబాద్‌తో సహా ఉన్న 14 సింగపూర్‌లోని మూడు డేటా సెంటర్లకు సంబంధించిన వ్యాపారంలో 26% వాటా ఈ కంపెనీకి ఉంటుంది.
ఈ లావాదేవీకి సంబంధించి ఒప్పందాన్ని ఎస్టీ టెలిమీడియా పూర్తి అనుబంధ సంస్థ ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్(ఎస్టీటీ జీడీసీ)తో రానున్న వారాల్లో కుదుర్చుకుంటామని పేర్కొంది. రుణ భారం తగ్గించుకోవడానికి, విస్తరణ కోసం ఈ నిధులను వినియోగిస్తామని వివరించింది. సముద్ర అంతర్భాగ, భూగోళ కేబుల్ నెట్వర్క్ ద్వారా టెలికం, డేటా సర్వీసుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టాటా టెలికమ్యూనికేషన్స్ అందిస్తోంది. ఈ కం పెనీకి ప్రపంచవ్యాప్తంగా 45 డేటా సెంటర్లున్నాయి. డీల్ నేపథ్యంలో టాటా కమ్యూనికేషన్స్ షేర్ బీఎస్ఈలో 1.6% నష్టపోయి రూ.443కు చేరింది.