జేఎల్ఆర్కు ఢోకా లేదు: రతన్ టాటా
కోవెంట్రీ(ఇంగ్లాండ్): జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్)కు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉందని టాటా గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా ధీమా వ్యక్తం చేశారు. జేఎల్ఆర్ భవిష్యత్తుకేమీ ఢోకా లేదని, తగిన స్థాయిలో వృద్ధి సాధించాలని, మార్కెట్ల అవసరాలను మాత్రం విస్మరించరాదని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో జేఎల్ఆర్ వాహనాలను అసెంబుల్ చేస్తున్నామని, భారత మార్కెట్ మరింతగా వృద్ధి సాధిస్తే ఇక్కడే ఈ కార్లను పూర్తి స్థాయిలో తయారు చేస్తామని వివరించారు.
జేఎల్ఆర్ వాహనాలను భారత్‌తో పాటు, తూర్పు యూరప్, అమెరికాల్లో కూడా తయారు చేస్తామని పేర్కొన్నారు. మార్కెట్ల అవసరాలను బట్టి భవిష్యత్తులో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉద్యోగుల అంకిత భావం, జేఎల్ఆర్ సీఈఓ రాల్ఫ్ స్పెత్ నాయకత్వ పటిమ కారణంగా జేఎల్ఆర్ బ్రాండ్లకు పూర్వ వైభవం దక్కిందని పేర్కొన్నారు. లండన్‌కు 150 కిమీ దూరంలో ఉన్న వార్విక్ యూనివర్శిటీ క్యాంపస్‌లో నేషనల్ ఆటోమోటివ్ ఇన్నోవేషన్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాహన రంగానికి అవసరమైన భవిష్యత్తు టెక్నాలజీలపై ఈ కేంద్రంలో పరిశోధనలు జరుగుతాయి. 2017 నుంచి ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
డిజిటల్ వెంచర్లకు అపార అవకాశాలు...
ఇంటర్నెట్ ఆధారిత డిజిటల్ వెంచర్లకు భారత్‌లో భారీ అవకాశాలున్నాయని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ పరిశ్రమ శైశవ దశలో ఉందని, ఈ రంగానికి తగిన తోడ్పాటునందించాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఐదు డిజిటల్ వెంచర్లు(స్నాప్‌డీల్, కార్దేఖో, అర్బన్ ల్యాడర్, బ్లూస్టోన్, పేటీఎం)ల్లో ఆయన పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.