విద్యుత్ సరఫరాపై మూడు కంపెనీల ఆసక్తి
సాక్షి, ముంబై: నగరంతోపాటు తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు కేవలం మూడు కంపెనీలు మాత్రమే ఆసక్తి కనబరిచాయి. ప్రస్తుతం విద్యుత్ సరఫరా చేస్తున్న టాటా పవర్ లెసైన్స్ గడువు ఈ ఏడాది ఆగస్టులో పూర్తికానుంది. దీంతో ప్రభుత్వం కొత్త కంపెనీల వేటలో పడింది. నేటి పోటీ ప్రపంచంలో ఊహించని విధంగా పెద్ద సంఖ్యలో కంపెనీలు ఆసక్తి కనబరచాలి. కాని పరిస్థితులు అందుకు భిన్నం గా ఉన్నాయి. కేవలం మూడు కంపెనీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి.
దీన్ని బట్టిచూస్తే విద్యుత్ రంగంలో కొనసాగుతున్న టోరెంట్ పవర్, రిల యన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎంఆర్, జీవీకే, సీఈఎస్సీ లాంటి పేరుగాంచిన బడా కంపెనీలు దూరం గా ఉండేందుకే ఇష్టపడినట్లు స్పష్టమవుతోంది. టాటా పవర్ గడువు దగ్గర పడడంతో ఆసక్తిగల కంపెనీలు 2014 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ పిలుపునిచ్చింది. కానీ ఆ గడువులోపు కేవలం మూడు కంపెనీలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం విస్మయానికి గురిచేసింది. ఇందులో టాటా పవర్ కూడా ఉంది. మిగతా రెండింటి లో మహా వితరణ, కోల్కతాకు చెందిన ఇండియా పవర్ కార్పొరేషన్ ఉన్నాయి. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా సాంకేతికపరమైన అంశాలు పరిశీలించి విచారణ జరుపుతారు. ఆ తరువాత తుది నిర్ణయం తీసుకుని ఏ కంపెనీకి అనుమతి ఇవ్వాలనేది ప్రకటిస్తారు.
అనుమతి పొందాలంటే ఆ కంపెనీకి సొంత విద్యుత్ సరఫరా చేసే ప్లాంట్ ఉండాలనేది ప్రధాన షరతు విధించారు. ముంబై తోపాటు శివారు ప్రాంతాల్లో 475 చదరపు కి.మీ. పరిధిలోని సుమారు నాలుగున్నర లక్షల వినియోగదారులకు టాటా పవర్ విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇందులో 87 శాతం నివాస గృహాల వినియోగదారులుండగా మిగతా 10.67 శాతం వాణిజ్య, 1.82 శాతం పరిశ్రమలు ఉన్నాయి.