ఉత్కృష్ట ప్రబంధం మనుచరిత్ర
భువన విజయం సాహితీ ప్రసంగాల్లో తాతా సందీప్
రాజమహేంద్రవరం కల్చరల్ :
‘ఆంధ్ర కవితా పితామహుడు’ అల్లసాని పెద్దన విరచిత మనుచరిత్ర ఉత్కృష్టమైన ప్రబంధమని యువ ద్విగుణిత అష్టావధాని తాతా సందీప్ కొనియాడారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్ జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న భువన విజయం సాహితీ ప్రసంగాలలో భాగంగా ‘మనుచరిత్ర–జీవన విధులు’ అంశంపై శుక్రవారం ఆయన ప్రసంగించారు. ‘శిరీష కుసు మ పేశల సుధామయోక్తుల’తో గ్రంథాన్ని రచించమన్న రాయలవారి కోర్కెపై పెద్దన మనుచరిత్రను అందించారని తెలిపారు. ఆదర్శ గృహస్థాశ్రమ ధర్మాలను ప్రవరాఖ్యుని పాత్ర ద్వారా పెద్దన తెలియజేరని చెప్పారు. పరివ్రాజకులు, సిద్ధు లు, భిక్షకులు వస్తే ఆతిథ్యం ఇవ్వడం పరమ ధర్మంగా ప్రవరాఖ్యుడు భావించేవాడన్నారు. హిమాలయాలపై లేపనం కరిగిపోయి, ఇంటికి వెళ్లలేని స్థితి ఎదురయినప్పుడు కూడా, ఇంట్లో అతిథి, అభ్యాగతుల సేవలు ఎలా జరుగుతున్నాయోనని ప్రవరాఖ్యుడు కలత చెందాడని సందీప్ తెలిపారు.
ప్రవరాఖ్యుని భార్య సోమిదమ్మ పాత్ర ద్వారా ఆదర్శ గృహిణి ఎలా ఉండాలో, కంటికి ఒత్తి పెట్టుకుని విద్యనేర్పే బ్రహ్మమిత్రుడి పాత్ర ద్వారా ఆదర్శ గురువు ఎలా ఉండాలో పెద్దన తెలియపరిచారన్నారు. కుటిలబుద్ధితో, మాయోపాయాలతో విద్యనేర్చుకున్న ఇందీవరాక్షుని పాత్ర ద్వారా శిషు్యడు ఎలా ఉండరాదో వివరించారని చెప్పారు. పూవ్వు, తావిలా భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించాలని హంసీచక్రవాదం ద్వారా తెలియజేశారన్నారు. విభావసి అనే స్త్రీ తన తండ్రికి అంత్యక్రియలు చేసే ఘటన మనుచరిత్రలో కనిపిస్తుందని చెప్పారు.
భువన విజయం సభలు ఇక్కడే జరిగాయి
చరిత్ర పరిశోధకుడు వై.ఎస్.నరసింహారావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ భువన విజయం సభలు రాజమహేంద్రవరంలోనే జరిగాయని మైసూరు విశ్వవిద్యాలయం రిటైర్డ్ తెలుగుశాఖ అధిపతి చెన్నాప్రగడ తిరుపతిరావు పరిశోధనల్లో వెల్లడయిందని తెలిపారు. సభకు డాక్టర్ మోపిదేవి విజయగోపాల్ అధ్యక్షత వహించారు. మంగళంపల్లి పాండురంగ విఠల్ స్వాగత వచనాలు పలికారు. యార్లగడ్డ మోహనరావు వందన సమర్పణ చేశారు. పరిషత్ గౌరవాధ్యక్షుడు చింతలపాటి శర్మ, డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, డాక్టర్ ఎ.వి.ఎస్.మహాలక్ష్మి, ఎం.వి.రాజగోపాల్ హాజరయ్యారు.