గెయిల్ గప్‌చుప్!
దెబ్బతిన్న గ్యాస్ పైప్‌లైన్ ఆధునీకరణకు తటపటాయింపు
తాటిపాక-విజయవాడ మధ్య దెబ్బతిన్న 130 కిలోమీటర్ల పైపులైన్
నగరం పేలుడు నేపథ్యంలో నిర్ధారించిన ఇంజనీర్స్ ఇండియా
మొత్తం మార్చడానికి రూ.1,300 కోట్లవుతుందని అంచనా
ప్రస్తుతం 54 కిలోమీటర్లకే పరిమితమవుతున్న గెయిల్
ఖర్చు రూ. 500 కోట్లకే పరిమితం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ ప్రమాదం, ప్రాణనష్టం సంభవించినప్పటికీ...ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్) చేసిన సూచనకు భిన్నంగా గ్యాస్ పైప్‌లైన్ మొత్తం ఆధునీకరించేందుకు గెయిల్ సంస్థ తటపటాయిస్తోందా? విశ్వసనీయ సమాచారం ప్రకారం దీనికి అవుననే సమాధానం వస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గత జూన్ 27న జరిగిన గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడు దుర్ఘటనను తలుచుకుని ఇంకా ఈ ప్రాంత వాసులు ఉలిక్కిపడుతూనే ఉన్నారు. తగిన సామర్థ్యం లేకపోవడం, నిర్వహణ లోపం తదితర కారణాలతో జరిగిన ఈ ప్రమాదం 23 మందిని పొట్టన పెట్టుకుంది. ఆ విషాదం తరువాత కృష్ణా, గోదావరి బేసిన్‌లోని గెయిల్ గ్యాస్ పైపులైన్ వ్యవస్థను ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్) తనిఖీ చేసింది. ఆ పైపులైన్లను మార్చాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు నివేదించింది. ఇంత జరిగినప్పటికీ మొత్తం గ్యాస్ పైపులైన్ ఆధునీకరించే విషయంలో గెయిల్ తటపటాయిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది.
కేజీ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరాకు తాటిపాక-విజయవాడ, మోరి-రాజమండ్రి మధ్య ప్రధాన ట్రంక్ పైపులైన్లు ఉన్నాయి. పైపులైన్లో సహజవాయువుతోపాటు క్రూడాయిల్, నీరు కూడా పంపుతారు. ఈ నేపథ్యంలో పైపులైను కాలపరిమితిని పది, పన్నెండేళ్లుగా నిర్ధారిస్తారు. తాటిపాక రిఫైనరీ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ కేంద్రానికి 17 ఏళ్ల కిందట వేసిన పైపులైను నాణ్యత దెబ్బతిందని ఈఐఎల్ బృందం నిర్ధారించింది. దీంతో దానిని మారుస్తున్నారు. కిలోమీటరు పైపులైన్ మార్చాలంటే రూ.10 కోట్ల వరకూ ఖర్చవుతుందని చమురు సంస్థల అంచనా. తాటిపాక రిఫైనరీ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ కేంద్రానికి మధ్య 130 కిలోమీటర్ల మేర ఉన్న పైపులైను శిథిలమైంది. దీని స్థానంలో కొత్త ట్రంక్ పైపులైను ఏర్పాటు చేయాలంటే రూ.1,300 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూ.500 కోట్లతో 54 కిలోమీటర్ల మేర పైపులైన్‌ను మాత్రమే ఆధునీకరించాలని గెయిల్ సంస్థ నిర్ణయించింది. ఈ పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం శివకోడు-చింతలపల్లి మధ్య పనులు జరుగుతున్నాయి.
ఇప్పటివరకూ కేజీ బేసిన్లో 18 అంగుళాల పైపులైన్లు ఉన్నాయి. నగరం ఘటన తర్వాత కొత్త పైపులైన్లను 24 అంగుళాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా పూర్తి కావడానికి నాలుగైదు నెలలు పడుతుందని అంచనా. అయితే ఇలా కొంతమేరకు పైపులైను మాత్రమే మార్చడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ విస్ఫోటం జరిగి పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగినప్పటికీ, మొత్తం పైపులైను మార్చడానికి గెయిల్ సంస్థ తటపటాయించడం విస్మయపరుస్తోందని వారంటున్నారు. మరోపక్క పైపులైను మార్చే పనులను సుమారు 15 విభాగాలుగా విభజించారు. ఇది పనుల నాణ్యతపై ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా మోరి-రాజమండ్రి ట్రంక్ పైపులైను నాణ్యతకు ఢోకా లేదన్న సమాచారంతో దీని ద్వారా గ్యాస్ సరఫరాను పునరుద్ధరించే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే విజ్జేశ్వరం పవర్ ప్లాంట్‌కు రోజుకు రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్లగ్యాస్ సరఫరా చేస్తున్నారు. మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్(జీసీఎస్)లో 26 గ్యాస్ బావులుండగా, ప్రస్తుతం ఐదింటి నుంచి సరఫరా జరుగుతోంది.