ఆస్తిపన్ను అసెస్మెంట్ ఇక ఈజీ...
→ ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్కు అవకాశం
→ జీహెచ్ఎంసీ మరో కొత్త కార్యక్రమం
→ అక్రమాల సిబ్బందికి ముకుతాడు
→ పారదర్శకంగా ఆస్తిపన్ను నిర్ధారణ
సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవడం ఒక ఎత్తయితే.. కొత్త ఇంటికి ఆస్తిపన్ను చెల్లించేందుకు అసెస్మెంట్ చేయించుకోవడం ఒక ఎత్తు. తాము కొత్తగా ఇల్లు కట్టుకున్నామని, ఆస్తిపన్ను కట్టేందుకు ఇంటి కొలతలు తీసి ఎంత మేర ఆస్తిపన్ను కట్టాలో వెల్లడించాలని, ఆస్తిపన్ను జాబితాలో తమ పేరు నమోదు చేయాలని కోరిన వారికి ట్యాక్స్ సెక్షన్ సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ఎన్ని పర్యాయాలు విజ్ఞప్తి చేసినా అసెస్మెంట్కు వెళ్లరు. అసెస్మెంట్ చేయాలంటే చేయి తడపాలి. అసెస్మెంట్లో కట్టాల్సిన ఆస్తిపన్నుకుంటే ఎక్కువ మొత్తం పడకుండా ఉండాలంటే ముడుపులు ముట్టజెప్పాలి. అంతేకాదు.. ఇంటి విస్తీర్ణం మేరకు చెల్లించాల్సిన దానికంటే తక్కువ మొత్తమే చెల్లించేలా అసెస్మెంట్ చేయమన్నా చేస్తారు. అయితే ఒక కండీషన్. వారు కోరినంత భారీ మొత్తాన్ని చెల్లించాలి. మాకు చెల్లించేది ఇప్పుడే కదా.. మీరు ప్రతియేటా చెల్లించే ఆస్తిపన్నులో లాభమేకదా అంటూ అందిన కాడికి దండుకుంటారు. ఏ మామూలు ఇచ్చుకోలేని వారి వినతులు అసలు పట్టించుకోరు. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ ఇళ్ల యజమానులే జీహెచ్ఎంసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకునే విధానాన్ని జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. వెబ్సైట్లో ఈ–రిజిస్ట్రేషన్స్‌లో ప్రాపర్టీటాక్స్లోకి.. అక్కడినుంచి ‘అసెస్మెంట్ ఫామ్’లోకి వెళితే సెల్ఫ్ అసెస్మెంట్ అప్లికేషన్ ఫారమ్ వస్తుంది. దాన్లోని సూచనల మేరకు వెళితే యూనిట్రేట్ తదితర వివరాలు కనిపిస్తాయి.
చేతివాటంలో ఘనాపాఠీలు..
తాము కట్టుకున్న భవనాలు, వ్యాపార సముదాయాలకు ఆస్తిపన్ను చెల్లించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నప్పటికీ వారు చెల్లించలేకపోతున్నారు. అందుకు కారణాలు..
→భవనాన్ని కొలతలు తీసి ఆస్తిపన్ను నిర్ధారించాల్సిన ట్యాక్స్ సిబ్బంది జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో అసలు కనిపించరు. అదేమని అడిగితే క్షేత్రస్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లకు, ఇతరత్రా పనులకు వెళ్లారని చెబుతారు.
→ అయితే వీరిలో చాలామంది ఈ పనులకు సైతం ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకొని, వారితోనే ఈ పనులు చేయిస్తుంటారు. భారీగా అందే ముడుపులతో వారికి జీతాలు చెల్లించడం టాక్స్ సిబ్బందికి సమస్యే కాదు.
→ ఒకవేళ కార్యాలయాల్లో కనిపించినా ఇళ్ల యజమానులు చెప్పేది వినిపించుకోరు. అసలు స్పందించరు. తమ చేయి తడిపితేనే స్పందిస్తారు. భారీ ముడుపులు ముడతాయనుకుంటేనే కదులుతారు.
→ నిబంధనల మేరకు.. ఏరియాను బట్టి, స్థల విస్తీర్ణాన్ని బట్టి ఆస్తిపన్ను నిర్ధారించాల్సి ఉండగా, తమ ఇష్టానుసారం అధిక మొత్తంలో ఆస్తిపన్నును నిర్ధారిస్తారు. ఇదేమని అడిగితే.. తమ వాటా ముడితే అందులో సగానికన్నా తగ్గించేందుందుకు సిద్ధమవుతారు. ఇలా ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఇబ్బడిముబ్బడిగా సంపాదించిన సొమ్ముతో వేసవిలో విదేశీ టూర్లు, ముజ్రాపార్టీలు చేసుకోవడం పరిపాటి అనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఏసీబీ దాడుల్లో ఈ విభాగం వారే ఎక్కువగా దొరుకుతున్నారు.
ఖజానాకు చిల్లు..
జీహెచ్ఎంసీ పరిధిలో ఏటా దాదాపు 80వేల భవనాల నిర్మాణం జరుగుతున్నప్పటికీ, కేవలం 30 వేల లోపు మాత్రమే ఆస్తిపన్ను జాబితాలో చేరుతున్నాయి. వీటిద్వారా జీహెచ్ఎంసీకి ఏటా దాదాపు రూ. 40 కోట్లు ఆస్తిపన్ను రూపేణా వసూలవుతోంది. కొత్త భవనాలన్నింటినీ ఆస్తిపన్ను పరిధిలోకి తెస్తే దాదాపు రూ.100 కోట్లు ఖజానాకు జమ అవుతాయి. అయితే తమ జేబులు నింపుకునేందుకు అలవాటుపడ్డ సిబ్బంది భవనాలను ఆస్తిపన్ను జాబితాలోకి తేవడం లేరు. జాబితాలో చేర్చకుండా తాము చూసుకుంటామని అందినకాడికి దండుకుంటున్నారు. ఆన్లైన్ అసెస్మెంట్ ద్వారా అయితే ఎప్పటికప్పుడు ఎన్ని దరఖాస్తులొచ్చిందీ తెలుస్తుంది కనుక, వారి ఆటలకు అడ్డుకట్ట వేయవచ్చునని భావిస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటినుంచి దాదాపు నెలన్నర రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. ప్రాక్టికల్‌గా ఎదురయ్యే ఇబ్బందుల్ని తొలగిస్తూ నెలరోజుల్లో నే ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా చూడాలని భావిస్తున్నారు.