మార్కెట్ విలువపైనే పన్ను వడ్డన
న్యూఢిల్లీ: దేశంలో నల్ల కుబేరులకు చెక్ పెట్టేందుకు కఠిన నిబంధనలతో రూపొందించిన ‘బహిర్గతం చేయని విదేశీ ఆదాయం, ఆస్తుల(కొత్త పన్ను విధింపు) బిల్లు-2015’లో ప్రభుత్వం కీలక నిబంధనను పొందుపరిచింది. ప్రభుత్వానికి వెల్లడించని విదేశీ ఆస్తులపై భారతీయులు చెల్లించాల్సిన పన్ను, జరిమానాను ఆస్తి కొనుగోలు ధరపై కాకుండా మార్కెట్ విలువ ప్రాతిపదికన చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆస్తి కొనుగోలుపై పాక్షిక వివరాలు చెప్పి ఉంటే పన్ను, జరిమానా చెల్లింపులో ఆ అంశాన్ని ప్రతిపాదిత చట్టం పరిగణనలోకి తీసుకోనుంది. విదేశీ ఆస్తులపై ఆదాయాన్ని చూపని వారికి గరిష్టంగా ఏడేళ్ల కఠిన జైలు శిక్ష విధించేలా ప్రభుత్వం బిల్లులో నిబంధనను పొందుపరిచింది.
అతిత్వరలో చర్చలు: స్విస్
జెనీవా: నల్లధనంపై సమాచార మార్పిడికి సం బంధించి త్వరలో భారత్తో చర్చలు ప్రారంభిస్తామని స్విట్జర్లాండ్ తెలిపింది. తమకు చట్టపరమైన అనుమతులు లభించగానే భారత్తో చర్చల మొదలుపెడతామంది.