మరింత సరళంగా పన్నుల వ్యవస్థ
* రెండు పన్ను సేవలను ప్రారంభించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
* అందుబాటులోకి ఈ-సహయోగ్, పాన్ క్యాంప్స్ సేవలు
న్యూఢిల్లీ: పన్నుల వ్యవస్థను మరింత స్నేహపూర్వకంగా మలచడానికి ఉద్దేశించిన రెండు కీలక చొరవలకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం శ్రీకారం చుట్టారు. ఇందులో ఒకటి ఈ-సహయోగ్కాగా, మరొకటి పాన్ క్యాంప్స్ ఏర్పాటు. పన్ను అంశాలకు సంబంధించి కార్యకలాపాలు సులభతరం చేయడం కూడా తాజా చొరవల లక్ష్యం. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ కేంద్రాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులతో కూడా మాట్లాడారు.
వివిధ అంశాలపై అధికారుల నుంచి వివరణలు కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ రూ.70,600 కోట్లకు పైగా రిఫండ్స్ జరిగినట్లు ఈ సందర్భంగా ఆర్థికమంత్రి వెల్లడించారు.
తాజా సేవలు ఇవీ...
ఈ-సహయోగ్: పేపర్ రహిత సేవలు ఈ-సహయోగ్ ప్రధాన ఉద్దేశం. దీనికింద అసెస్సీలకు నోటీసులు వారి ఈమెయిల్స్‌కే పంపించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ అమలు జరుగుతోంది. చిన్న కేసుల విషయంలో అసెస్సీ ఐటీ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా చేయాలన్నది ఈ పైలట్ ప్రాజెక్ట్ ముఖ్యాంశం.
ఐటీ శాఖ నోటీసులు పంపడం, సమాధానాలు తిరిగి పొందడం, పన్ను మదింపు వంటి ప్రక్రియ మొత్తం అసెస్సీల ఈ-మెయిల్స్ ద్వారానే జరగాలన్నది ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) లక్ష్యంగా ఉంది. 91,000 పన్ను చెల్లింపుదారుల విషయంలో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేయడం జరిగింది.
పాన్ క్యాంప్స్: పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కవరేజ్‌ను మరింత పెంచడం పాన్ క్యాంప్స్ లక్ష్యం. దేశంలో ప్రస్తుతం 23 కోట్ల మందికి పాన్ కార్డులు ఉన్నాయి. అయితే కేవలం 5 కోట్ల మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. ఆయా అంశాల నేపథ్యంలో సులభతర ఆర్థిక కార్యకలాపాలు, నల్లధనం నిరోధం లక్ష్యంగా ఈ సంఖ్య మరింత పెరగాలని కేంద్రం భావిస్తోంది. రూ. లక్ష దాటిన ప్రతి కొనుగోలు లేదా అమ్మకానికి పాన్ కార్డ్ వినియోగం తప్పనిసరి చేస్తున్నట్లు బడ్జెట్లో ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే అందరికీ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి పాన్ ఇప్పటికీ లేని అంశంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా శిబిరాల ఏర్పాటు ద్వారా పాన్ అందుబాటు సౌలభ్యం కల్పించడానికి కేంద్రం వ్యూహ రచన చేసింది. తాజా చొరవ నేపథ్యంలో సీబీడీటీ 43 పాన్ క్యాంప్స్ను ఏర్పాటు చేసింది.
డిజిన్వెస్ట్‌మెంట్ ప్రభావం ద్రవ్యలోటుపై ఉండదు..!
మరొక కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ, ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణల(డిజిన్వెస్ట్‌మెంట్) లక్ష్యం నెరవేరకపోవడం ద్రవ్యలోటుపై ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 3.9%గా ఉంటుందన్న భరోసాను ఆయన వ్యక్తం చేశారు. మెరుగైన పన్ను ఆదాయాలు, వ్యయాల కట్టడి అంశాలు ఇందుకు దోహదపడతాయన్నారు.
అంతర్జాతీయ అంశాలే డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం నెరవేరకపోవడానికి కారణమని అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ బడ్జెట్ లక్ష్యం రూ.69,500 కోట్లు. ఈ లక్ష్యాన్ని రూ.30,000 కోట్లకు తగ్గించాలని డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ భావిస్తున్నట్లు సమాచారం.
ఎన్పీఎస్కు పన్ను మినహాయింపులపై సమీక్ష: సిన్హా
ముంబై:నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)కు పూర్తి పన్ను మినహాయింపు వర్తింపజేస్తే... ఆదాయ నష్టం ఎంత ఉంటుందన్న అంశంపై కేంద్రం సమీక్ష జరుపుతుందని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. ఎన్‌పీఎస్‌ల కింద అక్టోబర్ మొదటి వారం నాటికి నిధుల నిర్వహణ రూ. 1.10 లక్షల కోట్లను దాటింది. చందాదారుల సంఖ్య కోటిని అధిగమించింది.
అంతర్జాతీయంగా పలు కమోడిటీల ధరలు దిగువస్థాయిలో ఉండడం... దేశంలో ప్రతిపాదిత డిజిన్వెస్ట్మెంట్కు ప్రధాన కంపెనీలుగా కమోడిటీ సంబంధిత సంస్థలే ఉండడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయా అంశాల నేపథ్యంలో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు అంతర్జాతీయ సవాళ్లే కారణమని విశ్లేషించారు.
ఐటీ చట్టాల సరళీకరణపై కమిటీ
ఆదాయపు పన్ను (ఐటీ) చట్టాల సరళీకరణపై సిఫారసులు చేయడానికి కేంద్రం మంగళవారం ఒక అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ ఈశ్వర్ నేతృత్వం వహించే ఈ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. జనవరి 31వ తేదీలోపు కమిటీ తన మధ్యంతర నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ అంశాన్ని వెల్లడించారు. 2016-17 బడ్జెట్లో కొన్ని అవసరమైన మార్పులు చేయడానికి వీలుగా తాజా కమిటీ సిఫారసులను వినియోగించుకోవాలన్నది కేంద్రం ప్రధాన ఉద్దేశమని అత్యున్నత స్థాయి వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఐటీ చట్టాలను సరళతరం చేయడమే కేంద్రం ప్రధాన లక్ష్యమని జైట్లీ పేర్కొన్నారు.