కడదాకా ఆధ్యాత్మిక చింతన...
ఆండీస్ పర్వతారోహణకు భగవద్గీత, రుద్రాక్షమాలను తీసుకెళ్లిన మస్తాన్బాబు
తెలుగు సహా మూడు భాషల్లో జాతీయ పతాకంపై చివరి సంతకం
సంగం (నెల్లూరు): జీవితాంతం ఆధ్యాత్మిక చింతనతో మెలిగిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు తన చివరి మజిలీలోనూ అదే మార్గాన్ని అనుసరించాడు. ఆండీస్ పర్వతారోహణ సమయంలో రుద్రాక్షమాల, భగవద్గీత వెంట తీసుకెళ్లాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తాను చిక్కుకున్నా వాటిని భద్రపరచి అందరికీ కనిపించేలా చేశాడు. భగవద్గీత, రుద్రాక్షమాల చెదరకుండా వాటిని రాళ్లగూటిలో అమర్చాడు. అలాగే జాతీయ పతాకంపై తెలుగు సహా మూడు భాషల్లో తన సంత కం చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తన పేరులోని తొలి రెండు అక్షరాలైన ‘ఎం ఎ’ను ఇంగ్లిష్లో, ‘స్తా’ అనే అక్షరాన్ని హిందీలో, ‘న్’ అనే అక్షరాన్ని తెలుగులో రాసి భారతీయతను చాటాడు మస్తాన్బాబు.
10 రోజుల్లో భారత్కు మృతదేహం
మస్తాన్బాబు మృతదేహాన్ని 10 రోజుల్లో భారత్కు పంపేలా చూస్తామని చిలీలోని భారత ఎంబసీ తెలిపినట్లు అతడి సోదరి డాక్టర్ మస్తానమ్మ చెప్పారు. గాంధీ జనసంగంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ చిలీలో ప్రతికూల వాతావరణం ఉండటంతో మృతదేహాన్ని తెచ్చేందుకు జాప్యం జరుగుతోందన్నారు.
మస్తాన్బాబు మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించి తగిన గుర్తింపు ఇవ్వాలని కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్లను కోరినట్లు చెప్పారు. కాగా, మస్తాన్బాబు ఆచూకీ కోసం చేపట్టిన ఏరియల్ సర్వేకు అయిన 50 వేల డాలర్ల ఖర్చును అందరి సహకారంతో అతని స్నేహితులు సమకూర్చారు. అలాగే స్వయంగా పర్వతారోహణ చేసి అతని మృతదేహాన్ని కనుగొన్నారు.