క్రమబద్ధీకరణ కలవరం!
సాక్షి, కరీంనగర్ : ఏటా విద్యార్థులు లేక మూతబడుతున్న సర్కారు స్కూళ్లు.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జరుగుతున్న ఉపాధ్యాయ పోస్టుల క్రమబద్ధీకరణ నిరుద్యోగ అభ్యర్థులపై నీళ్లు చల్లుతోంది. విద్యార్థులు లేక స్కూళ్లు మూతబడుతుంటే.. విద్యాశాఖ ఉపాధ్యాయ పోస్టులను ఇతర పాఠశాలలకు తరలిస్తోంది. గత విద్యా సంవత్సరం జిల్లా విద్యాశాఖ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను క్ర మబద్ధీకరించింది. ఆ సమయంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 540 ఎస్జీటీ పోస్టులు మిగిలాయి. ఇటు ఉన్నత పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య తగ్గి.. వెయ్యిమందికి పైగా ఉపాధ్యాయులు పనిలేకుండా ఉన్నారు. దీంతో డీఈవో లింగయ్య అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో సర్దుబాటు చే శారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈయేడు జిల్లావ్యాప్తంగా సర్కారు పాఠశాలల్లో 30వేల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిందని సాక్షాత్తూ విద్యాశాఖ గణాంకాలే చెప్తున్నాయి.
వెంటాడుతున్న గుబులు
‘దసరా సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ ఉంటుంది. ఆ తర్వాతే డీఎస్సీ నిర్వహిస్తాం’ అని ఈ నెల 2న సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీల సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ మళ్లీ క్రమబద్ధీకరణ చేపడితే.. ప్రస్తుతం జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 120 స్కూళ్లలో వందలాది ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గత విద్యా సంవత్సరం 540 మందిని సర్దుబాటు చేసిన అధికారులు వీరి సేవలు ఎక్కడ వినియోగించుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. మరోపక్క తర్వాత ప్రకటించే డీఎస్సీలోనూ పోస్టులు తగ్గుతాయి. దీంతో కొత్త రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువులొస్తాయనే కోటి ఆశతో ఉన్న నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో జిల్లాలో వేలాది మంది బీఎడ్, డీఎడ్, ఇతర కోర్సులు పూర్తి చేశారు. ఇప్పటికే వేలాది మంది ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. పేరున్న కేంద్రాల్లో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు.
పరిణామాల దారెటో..?
విద్యార్థుల సంఖ్య తగ్గిందే తడవుగా పాఠశాలలకు తాళం.. ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేస్తున్న అధికారులు భవిష్యత్తులో చోటుచేసుకునే పరిణామాల గురించి ఆలోచించడం లేదనిపిస్తోంది. ఒక్క సారి స్కూలుకు తాళం వేస్తే.. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో మళ్లీ పాఠశాల ఏర్పాటు అసాధ్యమని తెలిసినా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఆర్ధిక స్థోమత లేని, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది నిరుపేద విద్యార్థులు సర్కారు స్కూళ్లనే నమ్ముకుని ఉన్నారు. నేడు మూతబడ్డ పాఠశాలల పరిధిలో భవిష్యత్తులో విద్యార్థులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఆ ప్రాంతంలో విద్యార్థు పరిస్థితి ఏమిటో వారికే తెలియాలి. పాఠశాలలు మూతబడితే.. గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్ల సంఖ్య కూడా అదే తీరుగా పెరిగే అవకాశాలున్నాయి. సర్కారు స్కూళ్లపై ప్రజల విశ్వాసం సడలడంతోనే విద్యార్థులు ప్రైవేట్‌కు వెళ్తున్నారు. విషయం తెలిసినా.. ప్రభుత్వం మాత్రం పాఠశాలలను బలోపేతం చేసి వారి విశ్వాసాన్ని పొందేందుకు కృషి చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
నిరుద్యోగులకు అన్యాయం
ఎం.ప్రతాపరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, టీఆర్టీఎఫ్
ఉపాధ్యాయ పోస్టుల క్రమబ్ధ్దకరణ నిర్ణయంతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఏటా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల మనుగడపై ప్రతికూల ప్రభావం చూపుతున్న మాట వాస్తవమే. పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశాలుండవు. స్కూళ్లు మూతబడవు. పోస్టులూ తరలించే అవకాశముండదు.