teacher role
-
టీచర్ పోరాటం
స్కూల్ టీచర్‌గా మారారు జ్యోతిక. విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోనే తన బాధ్యత పూర్తి అయ్యిందనుకోలేదు. విద్యా వ్యవస్థలోని లోపాలను సరిచేయాలని పోరాటం మొదలుపెట్టారు. మరి.. ఆమె పోరాటం ఫలించిందా? అనే విషయాన్ని వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. జ్యోతిక ప్రధాన పాత్రలో ఎస్ఆర్ ప్రభు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎస్. రాజ్ దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో జ్యోతిక స్కూల్ టీచర్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాలో పాత్ర పరంగా విద్యా వ్యవస్థలోని లోటుపాట్లపై ఆమె పోరాటం చేస్తారట. 2003లో వచ్చిన ‘కాక్క కాక్క’ తర్వాత జ్యోతిక టీచర్‌గా నటిస్తున్నది ఇప్పుడే కావడం విశేషం. ఈ చిత్రానికి ‘రాక్షసి’ అనే టైటిల్ అనుకుంటున్నారని తెలిసింది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... ‘గులేబకావళి’ ఫేమ్ కల్యాణ్ దర్శకత్వంలో జ్యోతిక, రేవతి ముఖ్య పాత్రధారులుగా ఓ సినిమా తెరకెక్కనుంది. వేసవిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుందట. -
ముందు స్టూడెంట్... తర్వాత టీచర్
ఒక స్టూడెంట్ టీచర్‌గా మారాలంటే బోలెడంత టైమ్ పడుతుంది. కానీ సమంత మాత్రం తక్కువ టైమ్‌లోనే స్టూడెంట్ నుంచి టీచర్ స్థాయికి ఎదిగారు. కానీ ఆషామాషీ టీచర్‌గా కాదు. తేడా వస్తే తాట తీసే కర్రసాము టీచర్ అట. శివకార్తికేయన్, సమంత జంటగా పొన్రామ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘సీమరాజా’. ఇందులో కర్రసాము నేర్పించే టీచర్ సుదందిరదేవి పాత్రలో సమంత నటించారు. ఈ పాత్ర కోసం సమంత కష్టపడి కర్రసాము నేర్చుకున్నారు. 15 సార్లు మార్షల్ ఆర్ట్స్ క్లాసులకు వెళ్లారట. అంటే ముందు స్టూడెంట్‌గా కర్రసాము క్లాసులకు వెళ్లిన సమంత, వెండితెరపై టీచర్‌గా మారారు. ఇందులో నటి సిమ్రాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందించారు. ‘సీమరాజా’ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... పవన్‌కుమార్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘యు టర్న్’ సినిమా కూడా సెప్టెంబర్ 13నే విడుదల కానుండటం విశేషం. -
మెహరీన్ పాఠాలు
పువ్వులు పట్టుకోవాల్సిన ఆ సుకుమారి చేతులు బెత్తం పట్టుకుంటే.. ముద్దుముద్దుగా చిలక పలుకులు పలికే ఆ బ్యూటీ నోటి నుంచి చీవాట్లు వస్తే.. వెరైటీగా ఉంటుంది కదూ. ఇప్పటివరకూ బబ్లీ క్యారెక్టర్స్‌లో కనిపించిన మెహరీన్ ఇలాంటి పాత్రలోనే కనిపించనున్నారు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ పంజాబీ బ్యూటీ ప్రస్తుతం గోపీచంద్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు. చక్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మెహరీన్ టీచర్ పాత్రలో కనిపించనున్నారు. బెత్తం పట్టుకుని పంతులమ్మగా కనిపించనున్నారు. ఇప్పటివరకూ మోడ్రన్ దుస్తుల్లో కనువిందు చేసిన ఈ బ్యూటీ ఈ చిత్రంలో దాదాపు చీరల్లోనే కనిపించనున్నారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. -
టీచర్ అవతారం ఎత్తనున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా సంచలనమే.. ఏం చెప్పినా సంచలనమే. తనలాగే తన పార్టీలోని నాయకులంతా కూడా వైబ్రెంట్‌గా తయారు కావాలన్నది ఆయన సంకల్పం. అందుకే.. ఆయన టీచర్ అవతారం ఎత్తుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులందరికీ మే 1 నుంచి 4 వరకు నాలుగు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. దీనికి నాగార్జునసాగర్ వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగించిన ఉద్యమంలో అనుభవాలు, తాను ఎంపీగా, కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి అనుభవాలనే పాఠాలుగా చెబుతారట. అలాగని కేసీఆర్ ఒక్కరే కారు.. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన పలువురు నిపుణులు కూడా అక్కడకు వెళ్లి.. రాజకీయాలు, ఆర్థిక అంశాలు, బడ్జెట్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వైద్యం ఆరోగ్యం, పంచాయతీరాజ్.. ఇలా పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి రెండు రోజులు సుమారు వంద మంది వరకు ప్రతినిధులు క్లాసులకు హాజరవుతారు. చివరిరోజు జడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా వస్తారు. దాంతో సంఖ్య మరింత పెరుగుతుంది.