టీచర్ అవతారం ఎత్తనున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా సంచలనమే.. ఏం చెప్పినా సంచలనమే. తనలాగే తన పార్టీలోని నాయకులంతా కూడా వైబ్రెంట్గా తయారు కావాలన్నది ఆయన సంకల్పం. అందుకే.. ఆయన టీచర్ అవతారం ఎత్తుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులందరికీ మే 1 నుంచి 4 వరకు నాలుగు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. దీనికి నాగార్జునసాగర్ వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగించిన ఉద్యమంలో అనుభవాలు, తాను ఎంపీగా, కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి అనుభవాలనే పాఠాలుగా చెబుతారట.
అలాగని కేసీఆర్ ఒక్కరే కారు.. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన పలువురు నిపుణులు కూడా అక్కడకు వెళ్లి.. రాజకీయాలు, ఆర్థిక అంశాలు, బడ్జెట్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వైద్యం ఆరోగ్యం, పంచాయతీరాజ్.. ఇలా పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి రెండు రోజులు సుమారు వంద మంది వరకు ప్రతినిధులు క్లాసులకు హాజరవుతారు. చివరిరోజు జడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా వస్తారు. దాంతో సంఖ్య మరింత పెరుగుతుంది.