trs training classes
-
'పనీపాట లేనివాళ్లే విమర్శలు చేస్తున్నారు'
హైదరాబాద్ : టీఆర్ఎస్ శిక్షణా తరగతులపై విమర్శలు అర్థరహితమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పనీపాట లేనివాళ్లే టీఆర్ఎస్ శిక్షణా శిబిరంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సర్కార్ కోట్లు ఖర్చు పెట్టి యోగా తరగతులు ఎలా నిర్వహించిందని తలసాని ప్రశ్నించారు. సీపీ మహేందర్ రెడ్డి, సదారామ్ క్లాస్‌లు చెబితే తప్పేంటని ఆయన అన్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ఏ హోదాలో అమెరికా వెళ్లారని ప్రశ్నలు సంధించారు. లోకేశ్ వెంట సీఎం ఓఎస్డీ ఎందుకు వెళ్లారన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణాన్ని వ్యతిరేకించేవాళ్లకు అభివృద్ధి వద్దా అని అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అంతకు ముందు వాణిజ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ విషయంలో రాజీపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. బంగారంపై అమ్మకం పన్నును 5 శాతం పెంచే యోచనలో ఉన్నట్లు తలసాని తెలిపారు. -
'ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ'
నాగార్జునసాగర్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా మారుస్తాం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ శిక్షణ తరగతుల్లో కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని పంటల కాలనీగా మారుస్తామన్నారు. వ్యవసాయం లాభసాటి కాదన్న అపోహలు ప్రజల నుంచి తొలగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలో ఆదర్శ రైతులతో సమావేశం నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గోదాముల సంఖ్య పెంచుతామన్నారు. అలాగే వ్యవసాయదారులకు బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. రైతులకు అర్థమయ్యే భాషలోనే పరిశోధనలు, ఇతర అంశాలను భోదించాలని శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ సూచించారు. -
రెండో రోజు ప్రారంభమైన టీఆర్ఎస్ శిక్షణా తరగతులు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ శిక్షణా తరగతులు రెండోరోజు ఆదివారం ప్రారంభమైనాయి. ఈ శిక్షణ తరగతుల్లో పారిశ్రామిక విధానంపై ప్రధానం చర్చించనున్నారు. శిక్షణ తరగతుల నేపథ్యంలో పార్టీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలంతా నాగార్జునసాగర్‌లోనే ఉన్నారు. ఈ శిక్షణ తరగతులు సోమవారంతో ముగియనున్నాయి. టీఆర్ఎస్ శిక్షణ తరగతులు శనివారం నాగార్జునసాగర్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
టీచర్ అవతారం ఎత్తనున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా సంచలనమే.. ఏం చెప్పినా సంచలనమే. తనలాగే తన పార్టీలోని నాయకులంతా కూడా వైబ్రెంట్‌గా తయారు కావాలన్నది ఆయన సంకల్పం. అందుకే.. ఆయన టీచర్ అవతారం ఎత్తుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులందరికీ మే 1 నుంచి 4 వరకు నాలుగు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. దీనికి నాగార్జునసాగర్ వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగించిన ఉద్యమంలో అనుభవాలు, తాను ఎంపీగా, కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి అనుభవాలనే పాఠాలుగా చెబుతారట. అలాగని కేసీఆర్ ఒక్కరే కారు.. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన పలువురు నిపుణులు కూడా అక్కడకు వెళ్లి.. రాజకీయాలు, ఆర్థిక అంశాలు, బడ్జెట్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వైద్యం ఆరోగ్యం, పంచాయతీరాజ్.. ఇలా పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి రెండు రోజులు సుమారు వంద మంది వరకు ప్రతినిధులు క్లాసులకు హాజరవుతారు. చివరిరోజు జడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా వస్తారు. దాంతో సంఖ్య మరింత పెరుగుతుంది.