'పనీపాట లేనివాళ్లే విమర్శలు చేస్తున్నారు'
హైదరాబాద్ : టీఆర్ఎస్ శిక్షణా తరగతులపై విమర్శలు అర్థరహితమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పనీపాట లేనివాళ్లే టీఆర్ఎస్ శిక్షణా శిబిరంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సర్కార్ కోట్లు ఖర్చు పెట్టి యోగా తరగతులు ఎలా నిర్వహించిందని తలసాని ప్రశ్నించారు.
సీపీ మహేందర్ రెడ్డి, సదారామ్ క్లాస్లు చెబితే తప్పేంటని ఆయన అన్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ఏ హోదాలో అమెరికా వెళ్లారని ప్రశ్నలు సంధించారు. లోకేశ్ వెంట సీఎం ఓఎస్డీ ఎందుకు వెళ్లారన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణాన్ని వ్యతిరేకించేవాళ్లకు అభివృద్ధి వద్దా అని అన్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ అంతకు ముందు వాణిజ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ విషయంలో రాజీపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. బంగారంపై అమ్మకం పన్నును 5 శాతం పెంచే యోచనలో ఉన్నట్లు తలసాని తెలిపారు.