విద్యార్థులను వీడియో తీసిన మహిళా టీచర్
హైదరాబాద్: కాసుల కక్కుర్తితో విలువలకు పాతర వేస్తున్న కార్పొరేట్ స్కూళ్లలో మరో బాగోతం వెలుగుచూసింది. తమ స్వలాభం కోసం విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టేందుకు కార్పొరేట్ స్కూళ్లు వెనుకాడడం లేదు. బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఘటన కార్పొరేట్ స్కూళ్ల మధ్య జరుగుతున్న అనారోగ్యకర, అనైతిక పోటీకి అద్దం పడుతోంది.
9వ తరగతి చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ స్కూల్ టెరాస్ పై సన్నిహితంగా ఉండగా పక్కనే ఉన్న మరో పాఠశాలకు చెందిన మహిళా టీచర్ ఈ దృశ్యాన్ని తన మొబైల్ తో వీడియో తీసింది. దాన్ని ప్రిన్సిపాల్ కు చూపించింది. తమకు పోటీగా ఉన్న సదరు స్కూల్ కు చెడ్డపేరు తేవాలన్న ఆలోచనతో ఆయన ఈ వీడియోను వాట్సాప్ లో షేర్ చేశాడు. ఈ వీడియో విపరీతంగా సర్క్యూలేట్ అయి కొంతమంది మీడియా రిపోర్టర్లకు చేరింది. ఈ విషయాన్ని బయటకు రాకుండా చూడాలంటే తమకు డబ్బు ఇవ్వాలని వీడియోకు సంబంధించిన పాఠశాల యాజమాన్యాన్ని వారు బెదిరించారు.
చివరకు విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలికతో సన్నిహితంగా మెలగిన బాలుడు, వీడియో తీసిన టీచర్, దాన్ని షేర్ చేసిన ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేశారు. పాఠశాల యాజమ్యాన్ని బెదరించిన మీడియా రిపోర్టర్లపైనా దర్యాప్తు చేపట్టామని బాలానగర్ పోలీసు ఇన్స్ పెక్టర్ భిక్షపతి తెలిపారు.