Teacher union leaders
-
ఉపాధ్యాయ సంఘాల నేతలకూ టీడీపీ గాలం!
♦ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణకు బాధ్యత ♦ వచ్చే ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీలను గెలవడమే లక్ష్యం ♦ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మిగిలిన సంఘాలు సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రలోభాలకు గురిచేసి విపక్ష ఎమ్మెల్యేల్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు గిమ్మిక్కులు చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల నేతల్ని ఆకర్షించేందుకూ అదే దారి ఎంచుకుంది. తమ పార్టీకి అనుబంధంగా ఉన్న తెలుగునాడు ఉపాధ్యాయ సంఘానికి ఉపాధ్యాయ వర్గాల్లో ఏమాత్రం బలం లేకపోవడంతో మిగిలిన సంఘాలనుంచి నేతల్ని చేర్చుకుని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. వచ్చే ఏడాది నెల్లూరు-ప్రకాశం-చిత్తూరు, కడప-కర్నూలు-అనంతపురం ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం లక్ష్యంగా ఇప్పటినుంచే చేరికల వ్యూహాన్ని అమలు చేసి ఎన్నికల్లోగా తమ సంఘాన్ని బలోపేతం చేయాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లోని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకుల్ని నయానో, భయానో ఒప్పించి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్‌యూఎస్)లో చేర్పించాల్సిందిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించినట్టు సమాచారం. ఎన్జీవోల రాష్ట్ర నాయకుల్ని తమ వైపునకు తిప్పుకున్నట్టే ఉపాధ్యాయ సంఘాల నాయకులనూ తమవైపు ఆకర్షించాలని వారికి హితోపదేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల్లో ముఖ్యమైన నాయకుల్ని గుర్తించి, వారిని టీఎన్యూఎస్లోకి తీసుకొచ్చే బాధ్యతను కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గతేడాది నెగ్గిన ఏఎస్ రామకృష్ణకు అప్పగించారు. ఈ క్రమంలో టీఎన్యూఎస్లోకి ఇతర సంఘాల నేతల్ని చేర్పించే కార్యక్రమం ఊపందుకుంది. ఇటీవల గుంటూరు నగరానికి చెందిన ఎస్టీయూ కీలక నాయకుడిని తమ యూనియన్‌లో చేర్పించారు. అలాగే కృష్ణా జిల్లా పీఆర్టీయూ అధ్యక్ష పదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన నేతనూ తమ సంఘంలో చేర్పించారు. మరోవైపు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాల నాయకుల్ని ప్రలోభపెట్టి టీఎన్‌యూఎస్‌లో చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి టీఎన్‌యూఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభించి అన్ని యూనియన్లలోని ఉపాధ్యాయులను తమవైపు లాగేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు. తనను గెలిపించిన సంఘాలకే పంగనామాలు.. గతేడాది జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఓటమే ధ్యేయంగా 18 సంఘాలు కలసి పనిచేశాయి. ఏఎస్ రామకృష్ణకు మద్దతుగా నిలిచాయి. 18 సంఘాల మద్దతుతో గెలిచిన ఆయన ఇప్పుడు వాటికే పంగనామాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గత ఎన్నికల సందర్భంగా తప్పు చేశామని అవి ఇప్పుడు లెంపలేసుకుంటున్నాయి. రామకృష్ణ ఉపాధ్యాయుల సమస్యలను పక్కనపెట్టి టీడీపీ నేతగా మారిపోయారని మండిపడుతున్నాయి. వివిధ సంఘాల్లో అసంతృప్త నేతలకు గేలం వేయడమే పనిగా రామకృష్ణ కొద్దిరోజులుగా పనిచేస్తున్నారని విమర్శిస్తున్నాయి. -
జాబితా సిద్ధం
6,060 మందితో టీచర్ల సీనియార్టీ లిస్ట్ అభ్యంతరాలు స్వీకరణకు నేడు గడువు వెలుగు చూస్తున్న అక్రమాలు అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన సీనియార్టీ జాబితా ఎట్టకేలకు తయారైంది. శుక్రవారం రాత్రి ఈ జాబితాను విద్యాశాఖ కమిషనర్ ప్రకటించారు. అన్ని కేడర్లకు సంబంధించి 6,060 మంది టీచర్లతో కూడిన సీనియార్టీ జాబితాను డీఈఓ వెబ్సైట్లో ఉంచారు. షెడ్యూలు ప్రకారమైతే శుక్ర, శనివారం అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంది. అయితే ఒకరోజు ఇప్పటికే ముగియడంతో శనివారం సాయంత్రం మాత్రమే అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాలు ఎస్జీటీ కేడర్ అయితే మండల విద్యాశాఖ అధికారులు, స్కూల్ అసిస్టెంట్ కేడర్ అయితే డిప్యూటీ డీఈఓలకు ఆధారాలతో సహా అందజేయాల్సి ఉంటుంది. ఆయా ఎంఈఓ, డిప్యూటీ డీఈఓల పరిశీలన అనంతరం వాటిని పరిగ ణలోకి తీసుకుంటారు. అయితే ప్రాధాన్యత పాయింట్లు కేటాయింపుల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయులకు పాఠశాలలకు హాజరుశాతం, దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ధి, స్థానికంగా ఉన్నట్లు ధ్రువీకరణ తదితర అంశాల్లో భారీగానే అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు టీచర్లు అక్రమాలకు సంబంధించిన ఆధారాలను విద్యాశాఖ అధికారులకు అందజేశారు. సీనియార్టీ జాబితా పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో పని చేస్తున్న తోటి ఉపాధ్యాయులే కడుపు మండి అక్రమంగా పాయింట్లు వాడుకున్న టీచర్ల గురించి ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిసింది. దీనికితోడు కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సైతం అక్రమాల వివరాలను సేకరిస్తున్నారు. ఊపిరి పీల్చుకున్న విద్యాశాఖ సిబ్బంది ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు ఆమోదం చేసిన దరఖాస్తులను ఆన్లైన్ కన్ఫర్మేషన్ చేసే ప్రక్రియ ముగియడంతో విద్యాశాఖ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. డీఈఓ కార్యాలయంలో మూ డు రోజులుగా రోజూ అర్ధరాత్రి దాకా కన్ఫర్మేషన్ చేశారు. డీఈఓ అంజయ్య, డిప్యూటీ డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సుమారు 15 మంది హెచ్ఎంలు, డీఈఓ కార్యాలయ సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. -
ఇక ఒకటే గుర్తింపు సంఘం!
ఉపాధ్యాయ సంఘాలపై సర్కార్ దృష్టి ♦ బడులను వదిలి కార్యాలయాల చుట్టూ నేతల ప్రదక్షిణలు ♦ విద్యా శాఖలోనే ఇన్ని సంఘాలు ఎందుకు? ♦ తగ్గించే యోచనలో ప్రభుత్వం ♦ ఆర్టీసీ తరహా గుర్తింపు సంఘం విధానం తెద్దామా? ♦ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సంఘాలే ప్రాతినిధ్యం వహించేలా చేద్దామా? సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడంలో ముందుండాల్సిన ఉపాధ్యాయ సంఘాల నేతలే పాఠశాలలకు దూరమయ్యారు. కొన్ని సంఘాల నేతలు రాష్ట్ర స్థాయిలో ఆన్‌డ్యూటీ సదుపాయంతో విద్యారంగ సమస్యలపై తిరుగుతుంటే.. ఆన్‌డ్యూటీ సదుపాయం లేని వారు కూడా మేము సైతం అంటూ డెరైక్టరేట్ బాట పట్టారు. ఎలాగూ పర్యవేక్షణ అధికారులు లేరు. సంఘాలకు పట్టదు. దీంతో ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకునే వారు లేకుండాపోయారు. జిల్లాలు, మండల కేంద్రాల్లో మరీ దారుణం. స్కూళ్లలో తమ పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్న సంఘాల నేతలు తక్కువేనన్న అపవాదును ఉపాధ్యాయులు మూటగట్టుకోవాల్సి వస్తోంది. సంఘాల నేతల పేరుతో దాదాపు వందల మంది టీచర్లు బడిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వమూ దీనిపై దృష్టి సారించింది. సంఘాలను కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దృష్టిసారించిన సర్కారు... ఉపాధ్యాయ సంఘాలపై ఇదివరకే ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంఘాల లెక్క తేల్చే కసరత్తు చేస్తోంది. 42 ఉపాధ్యాయ సంఘాలు అవసరమా? ఆర్టీసీ తరహాలో ఒక గుర్తింపు సంఘం ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇటీవల వరంగల్‌లో మరోసారి స్పష్టం చేశారు. ఇది కుదరకపోతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని మూడు నాలుగు సంఘాలు మాత్రమే ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యం చేసేలా కట్టడి చేసేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా? అన్న అంశాలపై లోతైన పరిశీలన చేస్తోంది. ఏయే సంఘాల్లో ఎందరు? ప్రస్తుతం రాష్ట్రంలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు? ఏయే సంఘంలో ఎంత మంది సభ్యత్వం తీసుకున్నారన్న లెక్కలను తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఒకే ఉపాధ్యాయుడు ఐదారు సంఘాల్లో ఉండటంతో తాము ఎక్కువ సభ్యత్వం కలిగి ఉన్నామంటే తామే ఎక్కువ సభ్యత్వం కలిగి ఉన్నామంటూ చెబుతుండటం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అంటూ పాఠశాలలను వదిలి విద్యా డెరైక్టరేట్, డీఈఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా విద్యా హ క్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయుడు బడి బయట ఉండటానికి వీల్లేదు. ఎలాంటి డిప్యుటేషన్లలో కొనసాగడానికి వీల్లేదు. అయినా అలా జరుగుతూనే ఉంది. అందుకే సంఘాల పేరుతో తిరుగుతున్న ఉపాధ్యాయుల విషయంలో ఓ స్పష్టమైన విధానాన్ని తేవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయ సంఘాల బైలాస్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒక సంఘంలోని సభ్యుడు మరో సంఘంలో ఉండకుండా కట్టడి చేసేందుకు సభ్యత్వ నమోదుకు ఆధార్ కార్డు లింకు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 42 ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇన్ని అవసరమా? ఇన్ని ఉండటం వల్లే సంఘాల గౌరవం ప్రశ్నార్థకం అవుతోంది.. అందుకే గుర్తింపు సంఘం ఒకటే ఉండే అంశంపై ఆలోచిస్తాం. - ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి