ఉపాధ్యాయ సంఘాల నేతలకూ టీడీపీ గాలం!
♦ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణకు బాధ్యత
♦ వచ్చే ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీలను గెలవడమే లక్ష్యం
♦ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మిగిలిన సంఘాలు
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రలోభాలకు గురిచేసి విపక్ష ఎమ్మెల్యేల్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు గిమ్మిక్కులు చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల నేతల్ని ఆకర్షించేందుకూ అదే దారి ఎంచుకుంది. తమ పార్టీకి అనుబంధంగా ఉన్న తెలుగునాడు ఉపాధ్యాయ సంఘానికి ఉపాధ్యాయ వర్గాల్లో ఏమాత్రం బలం లేకపోవడంతో మిగిలిన సంఘాలనుంచి నేతల్ని చేర్చుకుని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. వచ్చే ఏడాది నెల్లూరు-ప్రకాశం-చిత్తూరు, కడప-కర్నూలు-అనంతపురం ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో గెలవడం లక్ష్యంగా ఇప్పటినుంచే చేరికల వ్యూహాన్ని అమలు చేసి ఎన్నికల్లోగా తమ సంఘాన్ని బలోపేతం చేయాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లోని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకుల్ని నయానో, భయానో ఒప్పించి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్‌యూఎస్)లో చేర్పించాల్సిందిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించినట్టు సమాచారం. ఎన్జీవోల రాష్ట్ర నాయకుల్ని తమ వైపునకు తిప్పుకున్నట్టే ఉపాధ్యాయ సంఘాల నాయకులనూ తమవైపు ఆకర్షించాలని వారికి హితోపదేశం చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల్లో ముఖ్యమైన నాయకుల్ని గుర్తించి, వారిని టీఎన్‌యూఎస్‌లోకి తీసుకొచ్చే బాధ్యతను కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గతేడాది నెగ్గిన ఏఎస్ రామకృష్ణకు అప్పగించారు. ఈ క్రమంలో టీఎన్‌యూఎస్‌లోకి ఇతర సంఘాల నేతల్ని చేర్పించే కార్యక్రమం ఊపందుకుంది. ఇటీవల గుంటూరు నగరానికి చెందిన ఎస్టీయూ కీలక నాయకుడిని తమ యూనియన్‌లో చేర్పించారు. అలాగే కృష్ణా జిల్లా పీఆర్‌టీయూ అధ్యక్ష పదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన నేతనూ తమ సంఘంలో చేర్పించారు. మరోవైపు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాల నాయకుల్ని ప్రలోభపెట్టి టీఎన్‌యూఎస్‌లో చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి టీఎన్‌యూఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభించి అన్ని యూనియన్లలోని ఉపాధ్యాయులను తమవైపు లాగేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు.
తనను గెలిపించిన సంఘాలకే పంగనామాలు..
గతేడాది జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఓటమే ధ్యేయంగా 18 సంఘాలు కలసి పనిచేశాయి. ఏఎస్ రామకృష్ణకు మద్దతుగా నిలిచాయి. 18 సంఘాల మద్దతుతో గెలిచిన ఆయన ఇప్పుడు వాటికే పంగనామాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గత ఎన్నికల సందర్భంగా తప్పు చేశామని అవి ఇప్పుడు లెంపలేసుకుంటున్నాయి. రామకృష్ణ ఉపాధ్యాయుల సమస్యలను పక్కనపెట్టి టీడీపీ నేతగా మారిపోయారని మండిపడుతున్నాయి. వివిధ సంఘాల్లో అసంతృప్త నేతలకు గేలం వేయడమే పనిగా రామకృష్ణ కొద్దిరోజులుగా పనిచేస్తున్నారని విమర్శిస్తున్నాయి.