డీఈఓ బదిలీ ?
విద్యారణ్యపురి : జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ బదిలీ అరుునట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత బదిలీ ఫైల్‌పై విద్యాశాఖ మంత్రి సంతకమైనట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని విద్యాశాఖ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లా విద్యాశాఖాధికారిగా విజయ్‌కుమార్ ఇక్కడికి వచ్చి ఏడాదిన్నర అవుతోంది.
తనిఖీలతో హడలెత్తించిన ఆయన... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం రాకుంటే సంబంధిత ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. అయితే డీఈఓ కార్యాలయ ఆధునికీకరణ, సీసీ కెమెరాల ఏర్పాటుపై విమర్శలు వెల్లువెత్తాయి. నిధులను సమీకరణలో అవకతవకలకు పాల్పడ్డారని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయుల సంఘాలు ఆందోళనకు దిగాయి.
ఉపాధ్యాయుల సస్పెన్షన్లు సరికాదని... నోటీస్‌లు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. కలెక్టర్‌తోపాటు ఉన్నత విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీఈఓపై విచారణ కూడా జరిగింది. కానీ.. ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు మళ్లీ ఆందోళనకు దిగారు.
మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం డీఈఓకు సానుకూలంగా ఉంటూవచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో నలుగురు డీఈఓలపై ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడం.. ఇందులో వరంగల్ జిల్లా డీఈఓ విజయ్కుమార్పైనా ఫిర్యాదుల నేపధ్యంలో ఆయన బదిలీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. అయనను మహబూబ్‌నగర్‌కు గానీ,రంగారెడ్డి జిల్లాకు గాని డీఈఓగా బదిలీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.