రచ్చబండ రసాభాస
అనకాపల్లి అర్బన్, అనకాపల్లి రూరల్ న్యూస్‌లైన్: మున్సిపల్ స్టేడియంలో మంగళవారం జరిగిన రచ్చబండ రసాభాసగా సాగింది. మూడు నెలలుగా జీతాలందుకోని జోనల్ పరిధి ఉపాధ్యాయులు రచ్చబండ వేదికపైకి వెళ్తున్న మంత్రి గంటాను నిలదీశారు. మహా విశాఖపట్నంలో అనకాపల్లి విలీనమైనప్పటి నుంచి నేటి వరకు ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదని, హెల్త్‌కార్డులు మంజూరులోనూ తీరని అన్యాయం జరుగుతోందన్నారు. జోనల్ కమిషనర్‌కు అధికారం లేకపోతే ఉపాధ్యాయుల జీతాలు, ఇంక్రిమెంట్లు, ఇన్‌కంటాక్స్ ఫారాల ఆమోదంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. అప్రెంటిస్ పూర్తి చేసుకున్న తొమ్మిది మంది ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఆర్డర్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నేతను లాక్కెళ్లిన పోలీసులు
పట్టణ సమస్యలు, నీలం తుపాను నష్టపరిహారం, చక్కెర కర్మాగారం ఆధునికీకరణ, ఫేజ్-1, ఫేజ్-2 సత్యనారాయణపురం లే అవుట్‌లోని 2551 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ స్థలాలను స్వాధీనం చేయకపోవడంపై టీడీపీ నియోజకవర్గ కోర్ కమిటీ సభ్యుడు బుద్ద నాగజగదీశ్వరరావు మంత్రిని నిలదీశారు. దీంతో ఆయనను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలతో పట్టణంలోని రోడ్లు, కాలువలు శిథిలమైనా జీవీఎంసీ అధికారులు పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత బి.ఎస్.ఎం.కె.జోగినాయుడు నేతృత్వంలో గంటాకు వినతిపత్రం అందజేశారు.
వైఎస్ వల్లే రచ్చబండ విజయం: మంత్రి గంటా
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రచ్చబండ కార్యక్రమం వల్లే ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ-3 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. అనంతరం పలువురికి పింఛన్ ధ్రువీకరణ పత్రాలు, హౌసింగ్ పంపిణీ, రేషన్ కార్డులు మంత్రి అందజేశారు. జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్ ఎ.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆరోఖ్యరాజ్, గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, జేసీ ప్రవీణ్‌కుమార్, ఆర్డీఓ వసంతరాయుడు, మండల ప్రత్యేకాధికారి అల్లూరి సుబ్బరాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కడిమిశెట్టి రాంజీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నడిపల్లి గణేష్, న్యాయవాది నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.