జీఓల విడుదలపై టీచర్ల హర్షం
అనంతపురం ఎడ్యుకేషన్: 25 ఏళ్లకు పైగా ఎదురు చూస్తున్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు కొలిక్కిరావడంతో ఉపాధ్యాయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన తర్వాత తాజాగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వం 72, 73, 74 జీఓలను విడుదల చేసింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ 1998 నుంచి అమలు చేస్తూ 72 జీఓ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల నుంచి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు పదోన్నతులు కల్పించేందుకు 73 జీఓ, ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పించేందుకు 74 జీఓను విడుదల చేసింది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా అన్ని కేడర్ల పోస్టులకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ముఖ్యంగా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న డైట్ అధ్యాపకులు, జూనియర్ అధ్యాపకులు, డెప్యూటీ డీఈఓ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైందని నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆప్టా జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రజనీకాంత్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఏపీటీఎఫ్(1938) జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కులశేఖర్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందు, రామన్న, బీఈడీ ఉపాధ్యాయ సంఘం నారాయణస్వామి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.