teachers strikes
-
అసంబద్ధత.. అశాస్త్రీయం
- వెబ్ కౌన్సెలింగ్‌ను వ్యతిరేకిస్తూ కదం తొక్కిన ఉపాధ్యాయులు - మంత్రుల పర్ఫామెన్స్‌కు పాయింట్లు వేసుకోవాలంటూ హితవు - రేపు సీఎం చంద్రబాబు ఇళ్లు ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపు - ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన డీఈఓ కార్యాలయం - ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ సంఘీభావం అనంతపురం రూరల్ : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో పెర్ఫార్మెన్స్ పాయింట్లు, వెబ్‌కౌన్సెలింగ్‌ను వ్యతిరేకిస్తూ బుధవారం ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన డీఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో ఉపాధ్యాయులు కదం తొక్కారు. ఈ విధానం అసంబద్ధంగానూ, అశాస్త్రీయంగానూ ఉందని మండిపడ్డారు. ఈ ఆందోళనకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయాన్ని దిగ్బంధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ వారికి సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులు తలపెట్టే ప్రతి ఉద్యమానికీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఐక్య ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ పర్ఫార్మెన్స్ పాయింట్లు, వెబ్‌కౌన్సెలింగ్ పేరిట ఉపాధ్యాయులను వేధిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. ఈ మూడేళ్ల కాలంలో మంత్రుల పర్ఫార్మెన్స్కు పాయింట్లు వేసుకోవాలని హితవు పలికారు. విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన దౌర్జన్యాలు, అక్రమాలకు పాయింట్లు వేస్తే వందకు వంద వస్తాయని ఎద్దేవా చేశారు. మంత్రులే దగ్గరుండి కార్పొరేట్ విద్యాసంస్థలను నడిపించడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుని సాధారణ కౌన్సెలింగ్ నిర్వహించాలని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం పట్టించుకోకుండా వెబ్‌కౌన్సెలింగ్ పెట్టడం ద్వారా తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మానుకుని సాధారణ కౌన్సెలింగ్ నిర్వహించాలని, లేకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా 23వ తేదీ తలపెట్టిన సీఎం ఇళ్లు(అమరావతిలో) ముట్టడి కార్యక్రమానికి జిల్లా నుంచి ఉపాధ్యాయులు పెద్దఎత్తున తరలి వెళ్లి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి, నరసింహులు, కూడేరు శ్రీనివాసులు, ఎస్టీయూ రామన్న, సూర్యనారాయణరెడ్డి, గోవింద్, ఏపీటీఎఫ్ హెచ్.కులశేఖర్‌రెడ్డి, సుబ్బయ్య, పీఆర్టీయూ రామక్రిష్ణారెడ్డి, శ్రీధర్, యూటీఎఫ్ నాయకులు జిలాన్, రమణయ్య, ఏపీటీఏ చంద్రశేఖర్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, పీఈటీ సంఘం జిల్లా అధ్యక్షుడు లింగమయ్య, పండిట్ అసోసియేషన్ ఎర్రిస్వామి, హెచ్ఎం అసోసియేషన్ నాయకులు రమణారెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సంఘాల నిరసన
అనంతపురం ఎడ్యుకేషన్ : రేషనలైజేషన్, టీచర్ల బదిలీలకు సంబంధించిన పాయింట్ల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదివారం ఉదయం డీఈఓ కార్యాలయంలో ఇన్చార్జ్ డీఈఓ శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించిన సమావేశాన్ని నాయకులు బహిష్కరించారు. కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట నిలబడి నిరసన తెలిపారు. ప్రాధాన్యత పాయింట్లలో కొందరి టీచర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ముఖ్యంగా వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు పదేపదే విన్నవించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. బదిలీలు వేసవి సెలవుల్లో పెట్టాలని కోరినా పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత పెట్టారన్నారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతారన్నారు. బదిలీలకు దరఖాస్తు గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్, ఏపీటీఎఫ్ (1938), హెచ్ఎం అసోసియేషన్, వైఎస్సార్‌టీఎఫ్, ఆప్టా, ఆర్‌యూపీపీ, ఉపాధ్యాయ సత్తా, ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, పీఎస్ హెచ్ఎం, ఎస్‌ఎల్‌టీఏ, గిరిజన ఉపాధ్యాయ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అయ్యవార్ల ఆగ్రహం
– డిమాండ్ల సాధనకు కలెక్టరేట్ ఎదుట ధర్నా – ఆందోళన ఉధతం చేస్తామని పీఆర్టీయూ హెచ్చరిక అనంతపురం అర్బన్ : తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందన కోసం చాలా కాలంగా వేచి చూసినవారు ఆఖరి అస్త్రంగా ఆందోళన బాట పట్టారు. ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధతరూపం దాల్చుతుందని పీఆర్టీయూ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామకష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రక్షణ లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను తక్షణం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు లోకల్ క్యాడర్‌ను నిర్ణయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కషి చేయాలన్నారు. సర్వీసు రూల్స్ సాధనలో టీడబ్ల్యూ, మునిసిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో భాగస్వామ్యం కల్పించాలన్నారు. డీఎస్సీ–2008కి ఎంపికై హామీపత్రాల ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు డీఎస్సీ–2012 వారికన్నా తక్కువ వేతనం వస్తోందని, వీరికి వేతన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీకి సంబంధించి పది నెలల బకాయిలు నగదుగా చెల్లించాలన్నారు. పీఆర్, మునిసిపల్, గురుకుల, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు అర్థ జీతపు సెలవు నగదుగా మార్చుకునే ఉత్తర్వులను పీఆర్సీ–2015 సిఫారసులకు అనుగుణంగా ఇవ్వాలని, పెన్షన్ నిర్ణయించడంలో వెయిటేజీని ఎనిమిది ఏళ్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. జడ్పీపీఎఫ్ని జీపీఎఫ్‌గా మార్చాలని, మోడల్ పాఠశాలల ఉపాధ్యాయులకు పీఆర్సీ–2015 వేతన స్కేళ్లను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సర్వీస్ రూల్స్ రూపొందించాలని, స్పెషల్ టీచర్లు రూ.398 వేతనంపై పనిచేసిన కాలానికి నోషనల్ ఇంక్రిమెంంట్లు ఇవ్వాలని, 1990 – 1995 మధ్య కాలంలో నియమితులైన స్పెషల్ టీచర్లకు ఏఏఎస్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎల్వీ కేశవనాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, కార్యదర్శి ఈశ్వరరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులు సి.రామకష్ణారెడ్డి, కేశవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఫణిరాజ్శర్మ, వి.శివశంకర్‌రెడ్డి, నాయకులు పుల్లారెడ్డి, రవీంద్ర, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.