
ఉపాధ్యాయ సంఘాల నిరసన
అనంతపురం ఎడ్యుకేషన్ : రేషనలైజేషన్, టీచర్ల బదిలీలకు సంబంధించిన పాయింట్ల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదివారం ఉదయం డీఈఓ కార్యాలయంలో ఇన్‌చార్జ్ డీఈఓ శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించిన సమావేశాన్ని నాయకులు బహిష్కరించారు. కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట నిలబడి నిరసన తెలిపారు. ప్రాధాన్యత పాయింట్లలో కొందరి టీచర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
ముఖ్యంగా వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు పదేపదే విన్నవించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. బదిలీలు వేసవి సెలవుల్లో పెట్టాలని కోరినా పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత పెట్టారన్నారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతారన్నారు. బదిలీలకు దరఖాస్తు గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్, ఏపీటీఎఫ్ (1938), హెచ్‌ఎం అసోసియేషన్, వైఎస్సార్‌టీఎఫ్, ఆప్టా, ఆర్‌యూపీపీ, ఉపాధ్యాయ సత్తా, ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, పీఎస్ హెచ్‌ఎం, ఎస్‌ఎల్‌టీఏ, గిరిజన ఉపాధ్యాయ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.